ఎల్కతుర్తి, వెలుగు: గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం (కేజీకేఎస్) ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ తెలిపారు. మహబూబాబాద్‌లో ప్రారంభమైన గీతన్నల చైతన్య బస్సు యాత్ర 16వ రోజుకు చేరుకుంది. ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ నుంచి బయల్దేరిన యాత్రకు ఎల్కతుర్తిలో గౌడ కులస్తులు స్వాగతం పలికారు. బస్టాండ్ సర్కిల్‌లో అంబేద్కర్ విగ్రహానికి, సర్వాయి పాపన్న ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎంవీ రమణ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల హామీల మేరకు గౌడ సంక్షేమానికి రూ.5 వేల కోట్లు కేటాయించాలని, గీత కార్మికుల పెన్షన్‌ను రూ.4 వేలకు, ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో పెండింగ్ ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని హామీ ఇచ్చి 32 నెలలు గడిచినా అమలు చేయలేదన్నారు. 1,600 మంది బాధితులకు సంబంధించిన సుమారు రూ.20 కోట్ల ఎక్స్‌గ్రేషియా పెండింగ్‌లో ఉందని తెలిపారు. 50 ఏండ్లు పైబడిన గీత కార్మికులకు పెన్షన్, ప్రతి కార్మికుడికీ కాటమయ్య రక్షణ సేఫ్టీ కిట్లు అందించాలని కోరారు. తాటి, ఈత, జీలుగ మొక్కలను పెద్ద ఎత్తున నాటడంతో పాటు, ప్రతి జిల్లాలో తాటి, ఈత ఉత్పత్తుల కేంద్రాలు ఏర్పాటు చేసి కల్లుకు మార్కెట్ కల్పించాలని అన్నారు. నీరా, తాటి ఉత్పత్తుల అభివృద్ధికి కేటాయించిన రూ.27 కోట్లు విడుదల చేసి నీరా యూనిట్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు కోసం చేసిన పోరాటానికి ప్రభుత్వం స్పందించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
