- ములుగులో హ్యామ్ రోడ్ల పైలాన్ ఆవిష్కరణ
- రూ.16 వేల కోట్లతో 2,145 గ్రామీణ రోడ్ల అభివృద్ధి
- ములుగు కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రారంభం
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఇనాగరేషన్లు
ఏటూరునాగారం/తాడ్వాయి/వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: చేయూత స్కీమ్‌లో భాగంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం నుంచి కొత్త పెన్షన్ల పంపిణీకి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అర్హులైన 24 మంది లబ్దిదారులకు సమ్మక్క-సారలమ్మ గద్దెల సాక్షిగా చెక్కులు అందజేశారు. గతంలో పెన్షన్ రాని వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికుల్లో అర్హులను గుర్తించి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తోంది. మధ్యాహ్నం 2.31 గంటలకు సీఎం హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్నారు.
ఎండోమెంట్అధికారుల ఆధ్వర్యంలో పూజారులు గిరిజన సంప్రదాయాలతో డోలు వాయిద్యాల మధ్య ఆలయ ప్రాంగణంలోకి సీఎంకు స్వాగతం పలికారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, జంపన్న గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్న సీఎం.. తులాబారంలో నిలువెత్తు 67 కేజీల బంగారం (బెల్లం) అమ్మవార్లకు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. భక్తుల దాహార్తి తీర్చేందుకు గద్దెల ప్రవేశం వద్ద ఏర్పాటుచేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను సీఎం ప్రారంభించి, అక్కడే ఉన్న మహిళా సంఘాల సభ్యులతో గ్రూప్ ఫోటో దిగారు. అనంతరం 3:32 గంటలకు సీఎం హెలికాప్టర్‌లో ములుగుకు చేరుకున్నారు.
గ్రామీణ రహదారుల పైలాన్ ఆవిష్కరణ..
ములుగులోని గట్టమ్మ ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన గ్రామీణ రహదారుల అభివృద్ధి పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. రూ.16,007 కోట్లతో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ములుగు వేదిక అయ్యిందని సీఎం అన్నారు. రాష్ట్రంలోని 7,448 కిలోమీటర్ల మేర 2,145 గ్రామీణ రహదారుల అభివృద్ధి చేపడుతున్నట్టు చెప్పారు. కొత్తగా నిర్మించిన ములుగు జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను సీఎం ప్రారంభించారు. అక్కడ ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ములుగు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. మేడారం సమ్మక్క-సారలమ్మ దేవాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని, మల్లూరు నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి త్వరలో నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు.
జంపన్న వాగుపై చెక్‌డ్యామ్‌లు, స్నాన ఘట్టాల నిర్మాణం చేపడతామన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, సమ్మక్క-సారలమ్మ బిడ్డలకు ‘సారె’ పేరిట నాణ్యమైన చీరలను అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ రావు, నాయని రాజేందర్ రెడ్డి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మురళి నాయక్, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, సెర్ఫ్ సీఈఓ దివ్య, మేడారం ఈఓ వీరస్వామి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
బుచ్చమ్మకు ఇల్లు కట్టిస్తానన్న సీఎం
మేడారం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డిని బుచ్చమ్మ అనే వృద్ధురాలు కలిసి తనకు ఇల్లు ఇవ్వాలని కోరింది. ఆమె పరిస్థితిని తెలుసుకున్న సీఎం స్పందిస్తూ “తప్పకుండా ఇల్లు కట్టిస్తాం” అని హామీ ఇచ్చారు. దీంతో వృద్ధురాలు ఆనందం వ్యక్తం చేసింది. కాగా, మేడారం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి భక్తులను ఆత్మీయంగా పలకరించారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో భక్తులకు షేక్‌హ్యాండ్ ఇస్తూ ఉత్సాహపరిచారు.
సీఎంకు రాఖీ కట్టిన సీతక్క
సమ్మక్క గద్దె వద్ద మొక్కులు చెల్లించుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ప్రతి ఏటా సీఎంకు సీతక్క రాఖీ కడతారు. ఈసారి రాఖీ పౌర్ణమికి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉండనున్నారు. దీంతో సీతక్క ఇప్పుడే రాఖీ కట్టగా సీఎం ఆశీర్వదించారు.
