- గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తోంది :
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హాలియా, వెలుగు : కృష్ణా జలాల్లో తెలంగాణకు 513 టీఎంసీల వాటా రావాల్సి ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం 299 టీఎంసీలకే పరిమితం అయ్యేలా గతంలో సంతకం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు విమర్శించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు.
కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్నే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. తెలంగాణ నీటి వాటా కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఎదుట గట్టిగా వాదించలేకపోయిందని మండిపడ్డారు.
కృష్ణా జలాల వాటాపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రూ.900 కోట్లు ఖర్చు చేసి నెట్టెంపాడు, డిండి, కల్వకుర్తి తదితర ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే.. ఇప్పుడు నీటి సమస్య ఉండేది కాదన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచే ప్రతిపాదనను అడ్డుకోవాలని కోరారు. మేడిగడ్డ ప్రాజెక్టు రూపకల్పనలోనే లోపాలున్నాయన్నారు.
నల్గొండ జిల్లాలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని, అనేక ప్రాంతాల్లో ఐదు గంటలకు మించి విద్యుత్ సరఫరా కావడం లేదని ఆరోపించారు. సాగర్ ఆయకట్టుకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
రైతు బీమా, ఫసల్ బీమా అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని, పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన సాగర్ డ్యాంను సందర్శించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నాగ వర్షిత్ రెడ్డి, నాయకులు కంకణాల శ్రీధర్ రెడ్డి, మన్నెం రంజిత్‌యాదవ్ పాల్గొన్నారు.
