పాలనను గాలికొదిలి భూ దోపిడీకే ప్రాధాన్యం: మాజీ మంత్రి హరీశ్ రావు

పాలనను గాలికొదిలి భూ దోపిడీకే ప్రాధాన్యం: మాజీ మంత్రి హరీశ్ రావు
  •  హామీలు నెరవేర్చని కాంగ్రెస్​పై ప్రజల్లో వ్యతిరేకత 
  • ఎమ్మెల్సీ స్థానాలు, ఖైరతాబాద్‌‌ ఉప ఎన్నికలో బీఆర్‌‌ఎస్‌‌ గెలుపు ఖాయం

    
పద్మారావునగర్, వెలుగు: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కాంగ్రెస్​నేతలు ప్రతిపక్షాలపై నోటికొచ్చినట్లు ఎదురుదాడికి దిగుతున్నారని, పాలనను గాలికొదిలేసి భూ దోపిడీకే ప్రాధాన్యం ఇస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్​రావు ఆరోపించారు. త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతోపాటు ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి, బీఆర్‌‌ఎస్‌‌ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బుధవారం బేగంపేటలోని జొరాస్ట్రియన్ క్లబ్‌‌లో పార్టీ సనత్‌‌నగర్ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హరీశ్‌‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అమలు సాధ్యంకాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను దగా చేసిందని మండిపడ్డారు. ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో 40 వేల మంది ఓటర్ల నమోదును లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌‌ఎస్‌‌ ప్రవీణ్ కుమార్‌‌, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌‌చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు శేషుకుమారి, మహేశ్వరి, రూప, కిరణ్మయి, మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.