కల్తీ కట్టడికి టీజీ సేఫ్..ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగాల విలీనం

కల్తీ కట్టడికి టీజీ సేఫ్..ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగాల విలీనం
  • తక్షణమే అమల్లోకి తెస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
  • డ్రగ్స్, ఫుడ్, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, లీగల్, 
  • ల్యాబ్, అడ్మినిస్ట్రేటివ్ వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఏర్పాటు
  • కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సీనియర్ ఐపీఎస్ 
  • అవినాశ్​ మహంతి నియామకం

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో కల్తీ ఆహారం, నకిలీ ఔషధాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వేర్వేరుగా పనిచేస్తున్న ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ), ఔషధ నియంత్రణ (డ్రగ్స్ కంట్రోల్) శాఖలను విలీనం చేస్తూ ‘తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎస్సెన్షియల్ డ్రగ్స్’ (టీజీ సేఫ్) పేరుతో నూతన ఏకీకృత అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్​చొంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఆగస్టు 15 నుంచే అమల్లోకి వచ్చాయి. కొత్తగా ఏర్పడిన 'టీజీ సేఫ్' అథారిటీకి మొదటి కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాశ్ మహంతిని నియమించింది. ఈ వ్యవస్థను తొలి విడతగా ‘క్యూర్’ రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వ్యాపార సంస్థలు, ఔషధ తయారీ కంపెనీలు ఈ ప్రాంతంలో అత్యధికంగా కేంద్రీకృతమై ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ప్రాథమిక దశలో ఇంటెలిజెన్స్ సేకరణ, డేటా విశ్లేషణ, జాయింట్ తనిఖీల కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందిస్తున్నారు.

ఈ అథారిటీ నిర్వహణకు తగిన బడ్జెట్ కేటాయింపులు చేయడంతో పాటు, ఖాళీగా ఉన్న పోస్టులను డిప్యూటేషన్, కాంట్రాక్ట్ లేదా అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ పద్ధతుల్లో భర్తీ చేయడానికి అనుమతులు మంజూరు చేశారు. 1981 నుంచి స్వతంత్రంగా పనిచేస్తున్న డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా సమర్థవంతమైన పర్యవేక్షణ, వేగవంతమైన చర్యలకు మార్గం సుగమమవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఆహార, ఔషధ రంగాల్లో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా తనిఖీ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని జీవోలో పేర్కొన్నారు. 


ఈ కమిటీ సిబ్బంది సర్వీసు రూల్స్, క్యాడర్, మౌలిక సదుపాయాల కల్పనపై అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది. క్యూర్ రీజియన్‌లో లభించే ఫలితాలను నిశితంగా పరిశీలించిన తర్వాత, రాష్ట్రమంతటా ఈ విలీన వ్యవస్థను విస్తరించడంపై నిర్ణీత కాలపరిమితిలోగా తుది సిఫార్సులు చేయనుంది. 

ఆరు ప్రత్యేక వింగ్స్..

నూతనంగా రూపుదిద్దుకున్న ‘టీజీ సేఫ్’ పరిధిలో పాలనాపరమైన విధులను సులభతరం చేయడానికి ప్రభుత్వం ఆరు ప్రత్యేక విభాగాలను అందుబాటులోకి తెచ్చింది. అందులో డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఫుడ్ సేఫ్టీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, లీగల్ అండ్ ప్రాసిక్యూషన్, లాబొరేటరీ, అడ్మినిస్ట్రేటివ్ వింగ్‌లు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో నిఘా, తనిఖీలు, ప్రాసిక్యూషన్‌ను పటిష్టం చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌కు డీజీపీ ద్వారా ప్రత్యేక పోలీస్ బలగాలను డిప్యూటేషన్‌పై కేటాయించనున్నారు. అలాగే ఫుడ్, డ్రగ్ టెస్టింగ్ ప్రయోగశాలలన్నింటినీ లాబొరేటరీ వింగ్ కిందకు తీసుకువచ్చారు. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం-2006, డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్-1940కి సంబంధించిన చట్టబద్ధమైన అధికారాలు, నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

తుకారాం ముండే స్టైల్ లో ఆకస్మిక తనిఖీలు..

ప్రస్తుతం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా ఉన్న అవినాశ్ మహంతికి కమిషనర్‌గా ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్రలో ఎఫ్‌డీఏ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐఏఎస్ అధికారి తుకారాం ముండే హోటళ్లు, రెస్టారెంట్లు, క్విక్ కామర్స్ హబ్‌లు, క్యాంటీన్లపై మెరుపు దాడులు చేసి దాదాపు వందలాది హోటళ్ల లైసెన్సులను రద్దు చేశారు. కోట్ల రూపాయల విలువైన కల్తీ ఆహారాన్ని సీజ్ చేసి యజమానులను బెంబేలెత్తిస్తున్నారు. సరిగ్గా ఇదే తరహా కఠినమైన, పారదర్శకమైన విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా ‘టీజీ సేఫ్’ ద్వారా రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధమైంది.