గురుకులంలో ర్యాగింగ్..టెన్త్ స్టూడెంట్లపై ఇంటర్ విద్యార్థుల వేధింపులు, దాడి..ఖమ్మం జిల్లాలో ఘటన

గురుకులంలో ర్యాగింగ్..టెన్త్ స్టూడెంట్లపై ఇంటర్ విద్యార్థుల వేధింపులు, దాడి..ఖమ్మం జిల్లాలో ఘటన

 

  • 15 మంది టెన్త్ స్టూడెంట్లకు గాయాలు
  •      కారేపల్లి మండలంలోని గాంధీనగరం గురుకులంలో ఘటన

కారేపల్లి, వెలుగు : ఇంటర్ స్టూడెంట్లు ర్యాగింగ్ పేరుతో టెన్త్ విద్యార్థులను వేధించడంతో పాటు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని గాంధీనగరం గిరిజన సంక్షేమ శాఖ గురుకుల స్కూల్ లో శనివారం రాత్రి జరిగింది. 

వివరాల్లోకి వెళ్తే... శనివారం రాత్రి భోజనం చేసిన అనంతరం ఇంటర్ స్టూడెంట్లు టెన్త్ విద్యార్థుల గదుల్లోకి వెళ్లి.. బట్టలు విప్పేయాలని వేధించడం, ర్యాగింగ్ చేయడంతో టెన్త్ స్టూడెంట్లు బయటికి వచ్చారు. దీంతో ఇంటర్ స్టూడెంట్లు సైతం బయటకు వచ్చి టెన్త్ విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 15 మంది స్టూడెంట్లు గాయపడ్డారు. గమనించి అడ్డుకునేందుకు ప్రయత్నించిన హిందీ టీచర్ పై కూడా ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు.

 విషయం తెలుసుకున్న టెన్త్ స్టూడెంట్ల తల్లిదండ్రులు ఆదివారం ఉదయం గురుకులానికి చేరుకొని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కారేపల్లి ఎస్సై గోపీ కాలేజీకి వచ్చి విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన స్టూడెంట్ల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని ఎస్సై చెప్పారు. 

కాగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురుకులంలో నిర్వహించిన ఆటల పోటీలే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, టెన్త్ స్టూడెండ్ల మధ్య జరిగిన కబడ్డీ పోటీలో ఇంటర్ విద్యార్ధులు ఓడిపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన వారు ర్యాగింగ్, దాడికి పాల్పడినట్లు 
తెలిసింది.