ఆ తల్లీకొడుకు డేంజర్.. క్రైమ్ వీడియోలు చూసి  ఇద్దరి హత్య..మరో నలుగురిని చంపేందుకు స్కెచ్

ఆ తల్లీకొడుకు డేంజర్.. క్రైమ్ వీడియోలు చూసి  ఇద్దరి హత్య..మరో నలుగురిని చంపేందుకు స్కెచ్
  •     హత్యలు చేసేందుకు కొడుకును ట్రైన్​ చేసిన తల్లి
  •     అరెస్ట్ చేసిన సిద్దిపేట జిల్లా పోలీసులు

సిద్దిపేట రూరల్, వెలుగు : ఈజీగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో తల్లీకొడుకులు కలిసి మహిళలను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఆన్ లైన్ లో క్రైమ్ వీడియోలు చూసి ఇప్పటికే ఇద్దరు మహిళలను హత్య చేయగా.. మరో నలుగురిని చంపేందుకూ స్కెచ్ వేశారు. ఓ మహిళ మర్డర్ కేసు విచారణలో భాగంగా ఈ తల్లీకొడుకుల వ్యవహారం బయటపడింది. మర్డర్స్ ప్లాన్ అమలు కోసం ఆ తల్లి తన కొడుకును ప్రత్యేకంగా ట్రైన్ చేయడం, ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేయడం విస్మయానికి గురి చేసింది. దీంతో తల్లీకొడుకులిద్దరినీ సిద్దిపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ ఆదివారం వెల్లడించారు. అక్బర్ పేట భూంపల్లి మండలం రామక్కపేట గ్రామ శివారులో వారం రోజుల కింద కాలిపోయిన స్థితిలో ఓ మహిళ డెడ్ బాడీ కనిపించింది. విచారణ జరిపిన పోలీసులు మృతురాలు భూంపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కు చెందిన అతికం విజయ (45)గా గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు విచారణ జరుపగా ... డబుల్ బెడ్ రూం ఇండ్ల వద్దే హోటల్, షాప్ నడుపుతున్న చాకలి రజిత తన కొడుకుతో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది.

రెండు హత్యలు.. ఓ చైన్ స్నాచింగ్

భూంపల్లి డబుల్ ఇండ్ల వద్ద చాకలి రజిత, ఆమె మైనర్ కొడుకు కలిసి హోటల్, షాప్ నడుపుతున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించాలన్న లక్ష్యంతో మహిళలను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. గత ఆదివారం సాయంత్రం అదే కాలనీకి చెందిన విజయ అనే మహిళ రజిత షాప్ వద్దకు వెళ్లింది. దీంతో రజిత, ఆమె కొడుకు కలిసి విజయను గొంతు నులిమి హత్య చేసిన అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకొని డెడ్ బాడీని షాపులోనే ఉంచారు. రాత్రి విజయ డెడ్ బాడీని ఓ బ్యాగ్ లో కుక్కి రామక్కపేట విలేజ్ రోడ్ లోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేశారు. పోలీసుల విచారణలో రజిత, ఆమె కొడుకుపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో విజయను మాత్రమే కాకుండా... మే నెలలో ఇదే కాలనీకి చెందిన కుంట రేఖను సైతం హత్య చేసి అచ్చుమాయపల్లి అటవీ ప్రాంతంలో కాల్చేసినట్లు తేలింది. అలాగే గతేడాది జూన్ లో ప్రస్తుత భూంపల్లి సర్పంచ్ అన్నపూర్ణ వాకింగ్ కు వెళ్తున్న సమయంలో ఆమె తలపై రాయితో కొట్టి బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లుగా తేలింది. నిందితుల వద్ద నుంచి రూ. 1.03 లక్షలు, 5.61 తులాల బంగారం, 53 తులాల వెండి, టీవీఎస్ ఎక్స్ ఎల్ ను స్వాధీనం చేసుకున్నట్టు సీపీ తెలిపారు.  

క్రైమ్ వీడియోలు చూసి మర్డర్ ప్లాన్

మహిళలను హత్య చేసేందుకు నిర్ణయించుకున్న తల్లీకొడుకులు మర్డర్ ప్లాన్ కోసం క్రైమ్ వీడియోలు చూసే వారని సీపీ తెలిపారు. మర్డర్ల కోసమే తన కొడుకును పటిష్టంగా తయారు చేసిందని, ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేయడంతో పాటు, అతడికి బలమైన ఆహారం పెట్టేదని సీపీ వెల్లడించారు.

మరో నలుగురి హత్యకు ప్లాన్

రేఖ, విజయను హత్య చేసిన తల్లీకొడుకులు మరో నలుగురి హత్యకు ప్లాన్ చేసినట్లు సీపీ వెల్లడించారు. తమ హోటల్ వద్దకు వచ్చే మహిళల ఇంటి పరిస్థితులు తెలుసుకొని, కుటుంబంలో గొడవలు జరుగుతున్న, ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేసి  వారి హత్యలకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని సీపీ తెలిపారు.