హైదరాబాద్, వెలుగు: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహాన్ని ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారని టాడీ టాపర్స్ కార్పొరేషన్ చైర్మన్ మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ తెలిపారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు గౌడ సంఘాలకు పిలుపునిచ్చారు. ఆదివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విగ్రహావిష్కరణ పోస్టర్‌ను నాయకులు విడుదల చేశారు. అనంతరం మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడారు. జనగామ నుంచి గోల్కొండ కోట వరకు సర్దార్ పాపన్న గౌడ్ తన సామ్రాజ్యాన్ని విస్తరించి బహుజన రాజ్య స్థాపనకు కృషి చేశారని తెలిపారు. ఆయన పోరాట పటిమ అందరికీ ఆదర్శనీయమని చెప్పారు. పార్టీలకు అతీతంగా గౌడ సంఘాల నేతలు, ప్రజలు అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ముఖ్యనేతలు పాల్గొంటారని నిర్వాహకులు వెల్లడించారు.
