- నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు: కేటీఆర్
- పథకాన్ని బలోపేతం చేయాల్సిందిపోయి ఎత్తేస్తరా అని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ పథకాన్ని ఎత్తేసేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. ప్రభుత్వ మోసపూరిత వైఖరిని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు. ఆదివారం ఆయన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర జనరల్ బాడీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రూ.51 వేల ఆర్థికసాయంతో మొదలైన ఈ పథకాన్ని దశలవారీగా రూ.75,116కు, అనంతరం రూ.1,00,116కు కేసీఆర్ పెంచారని తెలిపారు. కేసీఆర్ హయాంలో 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందిందన్నారు. కానీ, ఎన్నికలప్పుడు కల్యాణలక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
ఆడబిడ్డలు ఇప్పుడు తులం బంగారం కూడా డిమాండ్ చేస్తుండడంతో ప్రభుత్వం సమాధానం చెప్పలేక పథకాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. పెళ్లిళ్లు జరిగి చాలా కాలం గడిచినా కూడా తమకు రావాల్సిన కల్యాణలక్ష్మి సహాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న అర్హులైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి హైకోర్టు నాలుగుసార్లు గడువిచ్చినా ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు.
