- 120 మందికి పైగా అనుమానితుల విచారణ
- భర్త రాజేందర్ రెడ్డి ఫోన్లు, ల్యాప్‌టాప్ సీజ్
- శరీరంపై 27 కత్తిపోట్లు..
- రెడ్ టీ షర్ట్ వ్యక్తిపై పోలీసుల ప్రధాన దృష్టి
నల్గొండ, వెలుగు: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో సంచలనం సృష్టించిన టీచర్ రూపారెడ్డి హత్య కేసు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. హత్య జరిగి ఐదు రోజులు గడుస్తున్నా నిందితుల ఆచూకీ లభించకపోవడంతో కేసు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన మూడు ప్రత్యేక బృందాలు ప్రతి చిన్న క్లూను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి.
ఈ కేసులో ఇప్పటివరకు దాదాపు 120 మందికి పైగా అనుమానితులను విచారించగా, రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని కూడా గత మూడు రోజులుగా ప్రశ్నిస్తూ ఆయనకు చెందిన రెండు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ క్వార్టర్స్‌కు సమీపంలోనే ఈ ఘోరం జరగడం, దుండగులు రూపారెడ్డి తలపై రెండు సార్లు, శరీరంపై 25 సార్లు.. మొత్తం 27 చోట్ల కత్తులతో పొడిచి కిరాతకంగా చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణం ప్రొఫెషనల్ కిల్లర్స్ పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
రెడ్ టీ షర్ట్ వ్యక్తిపై ఫోకస్..
ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు రెడ్ టీ షర్ట్ ధరించి, ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు వేసుకున్న ఒక అనుమానిత వ్యక్తి ఆరు అడుగుల గోడ దూకి కిచెన్ డోర్ ద్వారా ఇంట్లోకి వెళ్లినట్లు గుర్తించారు. స్కూల్ నుంచి ఇంటికి చేరుకున్న రూపారెడ్డిని టార్గెట్ చేసిన ఆ వ్యక్తి, హత్య తర్వాత వెనుక వైపు నుంచి పారిపోయినట్లు గుర్తించారు. రూపారెడ్డి మొబైల్ ఫోన్ మాయం కావడం కేసులో మిస్టరీని మరింత పెంచింది.
దీంతో ఆమె కాల్ డేటా రికార్డ్స్ ఆధారంగా పోలీసులు డేటాను సేకరిస్తున్నారు. స్కూల్ భాగస్వాములు, సిబ్బందితో పాటు గతంలో ఆ పాఠశాలలో చదివిన పాత విద్యార్థులను, పాత కక్షలు ఉన్నవారిని కూడా విచారిస్తున్నారు. జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్న ఈ కేసులో లోతైన కుట్ర దాగి ఉన్నట్లు భావిస్తుండగా త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
