నల్గొండ, వెలుగు: నల్లగొండ పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ రసాభాసగా మారింది. గతంలో కలెక్టర్ సమక్షంలో పారదర్శకంగా లాటరీ తీసి ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లను తొలగించి కొంతమంది కార్పొరేటర్లు తమ అనుచరులకు ఇండ్లు కట్టబెడుతున్నారని డబుల్ బెడ్ రూమ్ బాధితులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు.
నల్గొండ పట్టణంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 551డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 2023లో లాటరీ ద్వారా ఇండ్ల పంపిణీ చేసిన లబ్ధిదారుల స్థానంలో లక్షలాది రూపాయలు వసూలు చేసి కొత్తవారికి ఇండ్లను కేటాయిస్తున్నారని భాదితులు ఆరోపిస్తున్నారు.
2023లో దాదాపు 7వేల దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 3 వేల మంది అర్హులను గుర్తించారని, అందులో లాటరీ విధానం ద్వారా 421 మందికి, అలాగే ఎమ్మెల్యే రికమండేషన్, డిసేబుల్డ్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ బాధితులు వంటి వికలాంగులు, వితంతువుల కేటగిరీలో మరో 131 మందిని ఎంపిక చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు ఎంక్వైరీ పేరుతో పాత జాబితాలోని దాదాపు 130 మంది అర్హుల పేర్లను తొలగించారని వాపోతున్నారు.
సీపీఎం నేతల అరెస్ట్
లిస్టులో అక్రమాలపై 22 బాధితులు సీపీఎం పార్టీని ఆశ్రయించారు. గతంలో కలెక్టర్ సమక్షంలో జరిగిన లాటరీ ప్రకారం మాత్రమే ఇళ్లను పంపిణీ చేయాలని, అతమకు అన్యాయం జరిగిందని వాపోయారు. కాగా, శనివారం నల్గొండ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా కమ్యూనిస్టు నేతలను అరెస్ట్ చేశారు.
తాము ఎలాంటి ఆందోళనకు పిలుపునివ్వలేదని, కేవలం మాట్లాడేందుకు సిద్ధమవుతుంటే అరెస్ట్ చేశారని సీపీఎం నేతలు మండిపడ్డారు. అరెస్ట్ అయిన వారిలో సీపీఎం నేతలు సుధాకర్ రెడ్డి, సలీం, నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు. వీరిని ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు గుర్రంపోడు పోలీస్ స్టేషన్‌లో ఉంచి అనంతరం విడుదల చేశారు.
