హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రాథమిక మత్స్య సహకార సంఘాలు, జిల్లా మత్స్య సహకార సంఘాలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సహకార సంఘాల చట్ట నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ సంఘాలకు పర్సన్ ఇన్‌చార్జ్‌లు, నామినేటెడ్ బాడీలను నియమించరాదని పేర్కొంది.
మత్స్యకార సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలంటూ జులైలో ఇచ్చిన వినతి పత్రంపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ములుగు జిల్లాకు చెందిన ఎస్. రఘుతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల విచారణ చేపట్టి పిటిషనర్లు సమర్పించిన వినతి పత్రాలను పరిగణనలోకి తీసుకుని చట్టప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ విచారణను ముగించారు.
