న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ హెడ్డాఫీసులో స్వాతంత్ర్య దినోత్సవాలకు సంబంధించిన ఒక వీడియో తరాజకీయ దుమారానికి తెరలేపింది. పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా పార్టీ చీఫ్మల్లికార్జున ఖర్గే జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. అయితే, పతాకావిష్కరణ తర్వాత ‘వందేమాతరం’ ఆలాపన జరుగుతున్న సమయంలో అక్కడున్నవారిని ఉద్దేశించి సోనియా గాంధీ చేతితో సైగలు చేశారు.
తర్వాత రాహుల్ గాంధీ కూడా అదే విధంగా సైగ చేశారు. దీంతో ‘వందేమాతరం’ గేయం పూర్తిగా పాడడం ఇష్టంలేక ఆపేయాలని సైగలు చేశారని, కాంగ్రెస్ అగ్రనేతలు జాతీయ గేయాన్ని అవమానించారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. వందేమాతరం ఆలాపనపై ఎలాంటి వివాదంలేదని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. జెండావిష్కరణ సందర్భంగా ఖర్గే ఎక్కువ సేపు ఎండలో నిల్చున్నారని, ఆయనకు ఓ కుర్చీ ఏర్పాటు చేయాలని సోనియాగాంధీ సైగలతో అక్కడి సిబ్బందికి చెప్పారని వివరించారు.
