మూగజీవాలకు ఆసరా.. రోజుకు 2,500కుపైగా కుక్కలకు ఆహారం

మూగజీవాలకు ఆసరా.. రోజుకు 2,500కుపైగా కుక్కలకు ఆహారం

ఆకలితో అలమటిస్తున్న వేలాది శునకాలకు ‘ఆసరా’నిచ్చింది ఆమె. రోజుకు 2,500కుపైగా కుక్కలకు ఆహారం అందించింది. ఎన్నో మూగజీవాలకు ఆశ్రయం కల్పిస్తూ.. వైద్యం అందిస్తూ.. తన సేవా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె పేరే గౌరీవందన. ప్రొఫెషనల్​గా గౌరీ లిరిసిస్ట్​. మరి ‘ఆసరా’ స్థాపించడానికి గల కారణాలేంటి? 

అది హైదరాబాద్​లోని షేక్ పేట పెట్రోల్ బంక్.. అక్కడ ఓ రోజు వేగంగా వచ్చిన కారు ఓ వీధి కుక్కను ఢీకొని ఈడ్చుకు వెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆ వీధి శునకం గాయపడి రక్తం కారుతూ, కళ్లనిండా నీళ్లతో, దీనంగా సాయం కోసం చూస్తోంది. అప్పుడే ఆ కుక్కను చూసిన గౌరీవందన అనే యువతి చలించిపోయింది. అంతే, ఇలా ప్రమాదాల్లో గాయపడుతున్న వీధి కుక్కల కోసం ‘ఆసరా’ పేరిట ఎనిమల్ వెల్ఫేర్ సంస్థను నెలకొల్పింది. గాయపడిన వీధి శునకాలు, కళ్లు లేని, రోగాల బారిన పడిన వీధి కుక్కలకు చికిత్స అందించడంతోపాటు వాటి ఆలనాపాలనా చూస్తున్నారామె. సినీ గీత రచయిత్రి అయిన గౌరీవందన తన ‘ఆసరా’ స్వచ్ఛంద సంస్థ ద్వారా మూగజీవాలైన శునకాలకు సేవలు అందిస్తున్నారు.

డాగ్ రెస్క్యూ సెంటర్ స్థాపన

గాయపడిన కుక్కలకు వైద్యంతోపాటు ఆశ్రయం కల్పించేందుకు బౌరంపేటలో డాగ్ రెస్క్యూ సెంటరును  ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాన్ని నగర శివార్లలోని అజీజ్ నగర్​కు మార్చాలని యత్నిస్తున్నామని గౌరీవందన చెప్పారు. ప్రస్తుతం150కి పైగా కుక్కలకు ఆశ్రయం కల్పిస్తూ, దీర్ఘకాలిక సంరక్షణ చేపట్టింది. ఆసరా వాలంటీర్లు గాయపడిన, అనారోగ్యంతో ఉన్న కుక్కలు, ఇతర జంతువులను పశువైద్యులు, నిపుణుల వద్దకు తీసుకువెళ్లి చికిత్సలు చేయిస్తున్నారు. కుక్కలకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షల నుంచి శస్త్రచికిత్సల వరకు అన్నీ అందించి, అవి కోలుకుని ఆరోగ్యకరమైన జీవితాలను గడిపేలా చూస్తున్నామని ఆసరా వాలంటీర్ సురేష్ చెప్పారు. వేసవికాలంలో మండుటెండలో జంతువులు డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు కేబీఆర్ పార్కులో నీటి గిన్నెలను పంపిణీచేశారు.

మన దేశ శునకాలు..

పెట్ లవర్స్ విదేశీ బ్రీడ్ కుక్కపిల్లలకు బదులు మన దేశీ కుక్కపిల్లలను పెంచుకునేలా వారిని ప్రోత్సహించేందుకు డాగ్ అడాప్షన్ కార్యక్రమాన్ని ఆసరా ప్రారంభించింది. నెక్లెస్ రోడ్డులోని డాగ్ పార్కులో ప్రతి ఆదివారం డాగ్ దత్తత కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దేశీ డాగ్ పప్పీస్ దత్తత కార్యక్రమం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. బ్రీడ్స్ బదులు మన దేశ కుక్క పిల్లలను పెంచుకునేందుకు డాగ్ లవర్స్ ముందుకొస్తున్నారు. ఇప్పటికే 200కి పైగా దేశీ కుక్క పిల్లలను దత్తత ఇచ్చింది ఆసరా. విదేశీ బ్రీడ్ పేరిట అక్రమంగా బ్రీడింగ్ చేయొద్దని, వీధి కుక్కలను చేరదీసి వాటిని పెంచుకోండి అని కోరుతున్నారు.

కుక్క పిల్లల దత్తత కోసం..

‘‘మీరు కుక్కపిల్లను దత్తత తీసుకున్నప్పుడు, ఒక జంతువుకు కేవలం ఇల్లు ఇవ్వడమే కాదు.. వాటికి జీవితంలో రెండో అవకాశాన్ని ఇస్తున్నారు’’ అని వాలంటీర్లు చెప్తున్నారు. దత్తత తీసుకుంటే పెంపుడు కుక్కలు కొత్త కుటుంబాల పట్ల అపారమైన విధేయత, కృతజ్ఞతతో ఉంటాయంటారు వాలంటీర్లు. కుక్కపిల్లలను దత్తత తీసుకునే వారి గృహాలను ఆసరా వాలంటీర్లు తనిఖీ చేసి, పెంపుడు జంతువుకు సురక్షితమైన వాతావరణం ఉందని నిర్ధారించుకున్న తర్వాత కుక్క పిల్లలను దత్తత ఇస్తున్నామని సురేష్ వివరించారు.

హస్కీ కుక్కల కోసం ప్రత్యేక ఆపరేషన్

పటాన్‌చెరులోని శంకర్‌పల్లి నుంచి ఆసరాకు ఒక అత్యవసర కాల్ వచ్చింది. హస్కీ కుక్కలను ఒక కంటైనర్‌లో తరలించి, అక్కడ వదిలివేసినట్లు సమాచారం అందింది. ఆసరా బృందం, స్వాన్ ఎన్జీఓ వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుంది. హస్కీ కుక్కలు చాలా దీన స్థితిలో రోడ్ల పక్కన పడి ఉన్నాయి. అప్పటికే కొందరు బాటసారులు కొన్ని కుక్కలను తీసుకువెళ్లగా మరో 6 హస్కీ కుక్కలను రక్షించారు.

హస్కీ కుక్కలు అక్రమ పెంపకందారుడికి లేదా పరిశోధనా ప్రయోగశాలకు సంబంధించిన కేసు అయి ఉండవచ్చని భావిస్తూ దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆసరా వ్యవస్థాపకురాలు గౌరీ వందన చెప్పారు. ‘‘దయచేసి అమాయక జంతువులను బాధపెట్టకండి. జంతుహింసను ఆపండి. జంతువుల ప్రాణాలకు విలువ ఉంది. జంతువుల పట్ల దయగా ఉండండి’’ అంటున్నారామె. ‘ఆసరా’ అందిస్తున్న సేవలు ఎన్నో ప్రాణాలకు ఊపిరినిస్తున్నాయి. మనుషులే కాదు.. ప్రతి జీవికీ బతికే హక్కు ఉందన్న సందేశంతో గౌరీవందన చేస్తున్న ఈ సేవా ప్రయాణం మరెందరికో స్ఫూర్తి.

ఆసరా ఆవిర్భావం..

డాగ్ లవర్ అయిన గౌరీవందన శునకాలకు సేవలందించాలనే లక్ష్యంతో 2019వ సంవత్సరంలో  ‘ఆసరా’ పేరిట స్వచ్ఛంద సంస్థను ఆరంభించారు. ‘‘హైదరాబాద్​లో  కొవిడ్-19 మహమ్మారి విజృంభించినప్పుడు రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు మూతపడటంతో వీధులు నిర్మానుష్యంగా మారాయి. వీధి జంతువులకు ఆహార వనరులు కనుమరుగయ్యాయి. వీధి కుక్కలతోపాటు వివిధ జంతువులకు మనుగడ రోజువారీ పోరాటంగా మారింది. పరిస్థితి తీవ్రతను గుర్తించి, లాక్‌డౌన్ సమయంలో మేం వీధి కుక్కలకు అత్యవసరంగా ఆహార సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించాం.

దీనిద్వారా ప్రతిరోజూ 2,500కు పైగా శునకాలకు ఆహారం అందించాం” అని గౌరీవందన నాటి రోజులను గుర్తుచేసుకున్నారు. నాటి చొరవ కుక్కలకు ఆహారం అందించడమే కాకుండా, గాయపడిన, అనారోగ్యంతో ఉన్న కుక్కలకు వైద్య సంరక్షణ, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న, పక్షవాతం వచ్చిన, వృద్ధ జంతువులకు ఆశ్రయం కల్పించడం వంటి వాటిపై దృష్టి సారించామన్నారు గౌరీవందన. మొదట కుక్కలకు టీకాలు వేసే కార్యక్రమాలు, గాయపడిన జంతువులకు చికిత్స చేయడానికి ప్రైవేట్ ఆసుపత్రులతో కలిసి పనిచేశామని, అంబులెన్స్ సేవలను అందించడానికి ప్రభుత్వ,  ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఆసరా నిర్వాహకురాలు చెప్పారు.