ప్రభుత్వమంటే నలుగురి చేతిలో పెత్తనం కాదు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ప్రభుత్వమంటే నలుగురి చేతిలో పెత్తనం కాదు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హనుమకొండ, వెలుగు: ప్రభుత్వం నలుగురి చేతిలో పెత్తనం కాదని, నాలుగు కోట్ల ప్రజలదనే భావనతో పనిచేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌‌‌‌లో శనివారం నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌‌‌‌తో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, ఇప్పటివరకు 5.56 లక్షల పాస్‌‌‌‌బుక్‌‌‌‌లు రైతులకు అందించామని వెల్లడించారు. దాదాపు 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, తాజాగా 10 వేలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్లు తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. రైతు రుణమాఫీ కింద 25.35 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల ప్రయోజనం కల్పించామని వివరించారు. అనంతరం హనుమకొండ అంబేద్కర్ భవన్‌‌‌‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్మార్ట్ కార్డుల ద్వారా లబ్ధిదారులు తమ ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లోని రేషన్ షాపుల్లోనూ సరుకులు తీసుకోవచ్చని తెలిపారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పరకాల పర్యటన నేపథ్యంలో మంత్రి పొంగులేటి ఏర్పాట్లను పరిశీలించారు.