మోదీ ‘దిమాకీ నక్సల్స్‌‌‌‌’ వివాదం..మహిళా రిజర్వేషన్‌‌‌‌పై మోదీ మాటల్లో నిజాయితీ లేదని కాంగ్రెస్‌‌‌‌ విమర్శ

మోదీ ‘దిమాకీ నక్సల్స్‌‌‌‌’ వివాదం..మహిళా రిజర్వేషన్‌‌‌‌పై మోదీ మాటల్లో నిజాయితీ లేదని కాంగ్రెస్‌‌‌‌ విమర్శ
  •     స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని రాజకీయాలకు వాడొద్దని మండిపాటు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ‘దిమాకీ నక్సల్స్‌‌‌‌’ కామెంట్లతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై ముద్ర వేయాలని చూస్తున్నారని ఆరోపించాయి. మహిళా రిజర్వేషన్‌‌‌‌పై మోదీ చేసిన వ్యాఖ్యలు కూడా ‘నిజాయితీ లేనివి’ అని కాంగ్రెస్‌‌‌‌ విమర్శించింది. శనివారం ఎర్రకోట నుంచి మోదీ ఇచ్చిన ప్రసంగంలో ‘దిమాకీ నక్సల్స్‌‌‌‌’ను గుర్తించి పక్కన పెట్టాలని పిలుపునిచ్చారు. దీనిపై కాంగ్రెస్‌‌‌‌ నేత జైరాం రమేశ్‌‌‌‌ స్పందిస్తూ.. గతంలో ‘అర్బన్‌‌‌‌ నక్సల్స్‌‌‌‌’ అన్న మోదీ ఇప్పుడు ‘దిమాకీ నక్సల్స్‌‌‌‌’ అంటున్నారని విమర్శించారు. ఇది మోదీ నిరాశకు నిదర్శనమన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేదికను రాజకీయాలకు వాడుకున్నారని తప్పుబట్టారు.

సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ అసమ్మతిని అణచివేసి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని భయపెట్టే ప్రయత్నమిదని ఆరోపించారు. సీపీఎం నేత ఎం.ఏ. బేబీ.. ప్రతిపక్షాలను ‘దేశ వ్యతిరేకులు’, ‘మావోయిస్టులు’గా ముద్ర వేయడం దుర్మార్గమన్నారు. ఎర్రకోట నుంచి అబద్ధాలు మాట్లాడొద్దని ఎస్పీ చీఫ్‌‌‌‌ అఖిలేశ్‌‌‌‌ యాదవ్‌‌‌‌ మండిపడ్డారు. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్‌‌‌‌ అమలు చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. మరోవైపు ప్రసంగంలో మోదీ తడబడిన వీడియోను కాంగ్రెస్‌‌‌‌, ఆప్‌‌‌‌ నేతలు సోషల్‌‌‌‌ మీడియాలో షేర్‌‌‌‌ చేశారు.