భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సీతారామ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌కు సంబంధించి భూ సేకరణ పూర్తి అయితే ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సీతారామ నీళ్లు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ అంకిత్ తె కలిసి శనివారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా సీతారామ ఎత్తిపోతల పథకం పంప్‌ను ఆన్‌చేసి నీటిని విడుదల చేశారు. అలాగే మరెళ్లపాడు లిఫ్ట్ఇరిగేషన్పనులను పరిశీలించి, పైప్‌లైన్, భూ సేకరణ, డిస్ట్రిబ్యూషన్కెనాల్స్, ఇతరత్రా పనులపై ఇరిగేషన్ ఆఫీసర్లపై చర్చించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి రైతులకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తోందన్నారు.
డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కు సంబంధించిన భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూములు అప్పగించిన రైతులకు పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన నిధులను ఇచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు.
రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రాజెక్టు నిర్మాణాలకు రైతులు సహకరించాలని కోరారు. సీతారామ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
పనుల్లో ఇప్పటికే ఆలస్యం జరిగిందని, ఇకపై ఒక్క రోజు కూడా జాప్యం లేకుండా పనులను పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులు సైతం ఈ నెలాఖరులోగా పూర్తి చేసేలా ఆఫీసర్లు కృషి చేయాలన్నారు. భూముల పరిహారం నిధులు ఎప్పుడొస్తాయోనని రైతులు అనుమానం చేయగా.. ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే తన భూములు రాసిస్తానని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చెప్పారు. భద్రాచలం సబ్కలెక్టర్మృణాల్ శ్రేష్ట, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
వైద్యానికి స్మార్ట్ రేషన్ కార్డు ఉపయోగపడదు
కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్స్మార్ట్ కార్డు వైద్యానికి ఉపయోగపడదని చెప్పారు. జిల్లాలో 3,25,751 స్మార్ట్‌రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
అనర్హులైన వాళ్లు తమ రేషన్ కార్డులను ప్రభుత్వానికి రిటర్న్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా భద్రాచలం
భద్రాచలాన్ని దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
రాబోయే గోదావరి పుష్కరాలను భద్రాచలం అభివృద్ధికి గొప్ప అవకాశంగా ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో 91,438 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతోందని, ఆయిల్‌పామ్, కోకో సాగులో జిల్లా రాష్ట్రంలోనే కీలకంగా ఎదుగుతోందన్నారు. గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, జాతీయ రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.
సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చరిత్ర, ప్రకృతి, పోరాటాలు, పరిశ్రమల సమ్మేళనమే భద్రాద్రికొత్తగూడెం జిల్లా అని పేర్కొన్నారు.
