హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో కొత్త కోర్టు భవనాల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయని రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ వెల్లడించారు. 2026–-27లో రాష్ట్ర ప్రభుత్వం రూ.751.45 కోట్లు కేటాయించిందని,13 జిల్లా కోర్టు సముదాయాల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా కేంద్ర సాయం కింద రూ.26.31 కోట్లు మంజూరుకాగా 43 కోర్టు హాళ్లు, 37 జడ్జిల నివాస క్వార్టర్లు నిర్మిస్తున్నట్టు చెప్పారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైకోర్టులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ మాట్లాడారు.
గతేడాది 80వేల కేసులు పరిష్కారం
ప్రజలకు నాణ్యమైన, సత్వర న్యాయం అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సహచర న్యాయమూర్తులు, న్యాయవాదుల సమన్వయంతో సత్వర న్యాయం సాధ్యమవుతోందని వివరించారు. గతేడాది 90,357 కేసులు దాఖలుకాగా 80,020 కేసులు పరిష్కారమయ్యాయని .. అంటే దాదాపు 88.5 శాతం కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. న్యాయవ్యవస్థలో డిజిటల్ సేవలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఈ-కోర్టు ప్రాజెక్టులకు రూ.87.06 కోట్లు మంజూరుకాగా రూ.63.09 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు.
హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల్లో ఈ-ఫైలింగ్‌తోపాటు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఈ-సమన్లు అందజేయడం, ధ్రువీకరణ ఈ-ఎఫ్‌ఐఆర్, ఈ-చార్జిషీట్లు దాఖలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ హైకోర్టు భవనానికి శతాబ్దం చరిత్ర ఉందని, 1919 నుంచి ఇదే భవనంలో కొనసాగుతూ వస్తోందని వెల్లడించారు. బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ. నరసింహారెడ్డి మాట్లాడుతూ న్యాయవాద వృత్తి వ్యాపారం కాదని, సమాజానికి చేసే సేవ అని, నిజాయితీ, నైతికత వృత్తికి ప్రాతిపదిక కావాలన్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. న్యాయమూర్తుల నియామకంలో తెలంగాణవారికి ప్రాధాన్యమివ్వాలని కోరారు. అంతేగాకుండా న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కోరారు.
