ఇండోనేసియాలో భూకంపం.. 47 మంది మృతి

ఇండోనేసియాలో భూకంపం.. 47 మంది మృతి
  • గంటల వ్యవధిలో రెండు సార్లు
  • రిక్టర్ స్కేలుపై 7.7, 6.9గా నమోదు
  • బిల్డింగులు నేలమట్టం.. రోడ్లపై విరిగిపడ్డ కొండచరియలు
  • సునామీ హెచ్చరికలు జారీ.. 3 గంటల తర్వాత విరమణ
  • ఫ్లోర్స్ లో 15 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం

జకార్తా: ఇండోనేసియా దేశంలో పెను విషాదం చోటుచేసుకుంది. దేశంలోని తూర్పు సముద్ర తీర ప్రాంతంలో శనివారం రెండు భూకంపాలు సంభవించాయి. తెల్లవారుజామున 4:58 గంటలకు మొదట 7.7 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తర్వాత కాసేపటి వరకు ఆఫ్టర్ షాక్స్ తో భూమి స్వల్పంగా కంపిస్తూనే ఉంది. ఈ భూకంపం సంభవించిన గంటల వ్యవధిలో మరోసారి 6.9 తీవ్రతతో మరో భూకంపం దేశాన్ని వణికించింది. ఈ రెండు భూకంపాల ధాటికి 47 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఫ్లోర్స్ ప్రాంతంలో సుమారు 15 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తించినట్లు ఇండోనేసియా జియోఫిజిక్స్ ఏజెన్సీ (బీఎంకేజీ) స్పష్టం చేసింది. భూ ప్రకంపనల కారణంగా సముద్రంలో అలలు భారీగా ఎగిసిపడ్డాయని తెలిపింది. పలు తీర ప్రాంతాల్లో 1 మీటరు ఎత్తులో అలలు విరుచుకుపడ్డాయని వివరించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితిని సమీక్షించి మూడు గంటల తర్వాత హెచ్చరికలను ఎత్తివేశారు. భూకంపం తర్వాత డజన్ల కొద్దీ ఆఫ్టర్‌‌‌‌‌‌‌‌షాక్‌‌‌‌‌‌‌‌లు (ప్రకంపనలు) పునరావృతమయ్యాయి. ఈస్ట్ నుసా టెంగారా, పశ్చిమ నుసా టెంగారా, దక్షిణ సులవేసి ప్రాంతాల్లో భూమి ప్రకంపనలు దాదాపు నిమిషం పాటు ఏకధాటిగా కొనసాగాయి. దీంతో ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలంతా ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.

తీవ్రంగా దెబ్బతిన్న మౌమెరే

భూకంపం కారణంగా ఫ్లోర్స్ ద్వీపంలోని సిక్కా రీజెన్సీలో ఉన్న  ప్రధాన పట్టణం మౌమెరే తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడ రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు 20 మృతదేహాలను వెలికితీశారు. అలాగే, మంగరై రీజెన్సీలోని రెయోక్ గ్రామంలో  విరిగిపడ్డ కొండచరియల కింద నుంచి16 డెడ్ బాడీలను వెలికితీసినట్లు సిటీ రెస్క్యూ ఏజెన్సీ తెలిపింది.గాయపడిన ఆరుగురిని కాపాడగా, మరో ఇద్దరు వ్యక్తులు కూలిపోయిన గోడల శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు వివరించింది.  మౌమెరే పోర్టులో ఒక పెద్ద భవనం కుప్పకూలుతున్న సమయంలో ప్రజలు భయంతో అరుస్తూ పరిగెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అలాగే, భూకంప కేంద్రానికి అత్యంత దగ్గరగా ఉన్న నాగేకియో ప్రాంతంపై విపత్తు తీవ్ర ప్రభావం చూపింది. భూప్రకంపనలతో నాగేకియోలో కమ్యూనికేషన్ సిగ్నల్స్ పూర్తిగా నిలిచిపోయింది. కొండచరియలు విరిగిపడి రోడ్లు బ్లాక్ అయ్యాయి. దీంతో రెస్క్యూ బృందాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. నాగేకియో ప్రాంతంలోని సుమారు 2,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించారు. పలుచోట్ల ఇళ్లు, భారీ గిడ్డంగులు, ప్రభుత్వ భవనాలు నేలమట్టమయ్యాయి. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు, బీఎంకేజీ బృందాలు భుకంప ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేస్తూనే, నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 'పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఇండోనేసియా దేశం ఉంది. ఇక్కడ అనేక టెక్టోనిక్ ఫలకాలు తరచూ ఒకదానితో ఒకటి ఢీకొంటుంటాయి. దాంతో ఈ ప్రాంతంలో భూకంపాలు, భయంకరమైన అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి.