దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానంలో ఎమర్జెన్సీ అలర్ట్: అసలేం జరిగింది?

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానంలో ఎమర్జెన్సీ అలర్ట్: అసలేం జరిగింది?

దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌ బయలుదేరిన 'ఫ్లైదుబాయ్' విమానం ప్రయాణంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బోయింగ్ 737 మాక్స్ 8 విమానం సౌదీ అరేబియా గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది. దీంతో దాదాపు 150 మందికి పైగా ప్రయాణికులు ఉన్న విమానం ఒక్కసారిగా తిరిగి సౌదీకి యూటర్న్ తీసుకుంది.    

ఈ విమానం అత్యవసర పరిస్థితిని సూచించే 'స్వాక్ కోడ్ 7700' సిగ్నల్‌ను జారీ చేసింది. అంతేకాకుండా కొన్ని ఫ్లైట్ ట్రాకర్లు ఇది హైజాకింగ్‌ను సూచించే '7500' కోడ్‌కి కూడా మారినట్లు చూపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు.   

ఈ పరిణామంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ వైమానిక దళం వెంటనే రంగంలోకి దిగి, యుద్ధ విమానాలను గాల్లోకి దించింది. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ అత్యవసర భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.   

అయితే ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని ప్రతినిధి.. ఇది హైజాకింగ్ కాదని స్పష్టం చేశారు. విమానం సౌదీ అరేబియాలోని తబూక్ నగరంలో సురక్షితంగా ల్యాండ్ కానుందని.. ఆ తర్వాతే అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు వెల్లడవుతాయని భద్రతా వర్గాలు తెలిపాయి.