- రాష్ట్రవ్యాప్తంగా డీసీఏ అధికారుల తనిఖీలు
- ప్రిస్క్రిప్షన్ లేకుండానే మౌంజారో, ఓజెంపిక్, వెగోవీ సేల్
- డాక్టర్ల సలహా లేకుండా వాడొద్దని ప్రజలకు డీసీఏ సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా బరువు తగ్గే మందుల అక్రమ అమ్మకాలపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) కొరడా ఝులిపించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు మెడికల్ షాపులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ తనిఖీల్లో మౌంజారో, ఓజెంపిక్, వెగోవీ, రైబెల్సస్ సహా పేటెంట్ గడువు ముగిసిన తర్వాత మార్కెట్లోకి వచ్చిన పలు సెమాగ్లుటైడ్ జెనరిక్ మందుల అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించింది. నిబంధనలు పాటించని 43 మెడికల్ షాపులకు అధికారులు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940 ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
రూల్స్ బ్రేక్ చేస్తున్నరు
తనిఖీల సందర్భంగా మెడికల్ షాపుల నిర్వహకులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్పెషలిస్ట్ డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులను అమ్మడం, కొనుగోలుదారులకు బిల్లులు ఇవ్వకపోవడం, సేల్స్ బిల్లుల రికార్డులను నిర్వహించకపోవడం, రికార్డులను అధికారులకు చూపించకపోవడం వంటి లోపాలను గుర్తించారు. అలాగే ప్రిస్క్రిప్షన్ డ్రగ్ రిజిస్టర్లను నిర్వహించకపోవడం, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకుండానే అమ్మకాలు జరపడం, కొనుగోలు బిల్లులు చూపించకపోవడం, సేల్స్ అండ్ పర్చెజెస్ కాపీల నిర్వహణలో అవకతవకలకు పాల్పడటం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు.
సొంతంగా వాడితే ముప్పే...
సెమాగ్లుటైడ్ తదితర బరువు తగ్గే మందులను ఎండోక్రినాలజిస్టులు, ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు, లేబుల్‌పై సూచించిన విధంగా కార్డియాలజిస్టుల ప్రిస్క్రిప్షన్ ప్రకారమే వాడాలని ప్రజలకు డీసీఏ సూచించింది. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా సొంతంగా వాడితే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించింది. వీటిని కేవలం లైసెన్స్ ఉన్న మెడికల్ షాపుల నుంచే సరైన ప్రిస్క్రిప్షన్‌తో కొనుగోలు చేయాలని, నాసిరకం, నకిలీవి అయ్యే ముప్పు ఉన్నందున అనధికారిక విక్రేతల నుంచి కొనుగోలు చేయవద్దని స్పష్టం చేసింది. నకిలీ మందులు, అక్రమ అమ్మకాలపై సమాచారం ఉంటే డీసీఏ టోల్‌ఫ్రీ నంబర్ 1800-–599-–6969 కు పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.
