సుమంత్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్‌లో సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. కలిపు మధు, లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్‌తో ఆసక్తిని పెంచిన మేకర్స్.. తాజాగా మరో కీలక పాత్రను పరిచయం చేశారు. హాస్యనటుడు బ్రహ్మానందం పాత్రకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన అమ్మవారిని ఆరాధించే భక్తుడి పాత్రలో కనిపిస్తున్నారు. ‘
అమ్మ వారాహి మా మహేంద్రగిరిని కాపాడు తల్లి’ అంటూ బ్రహ్మానందం ప్రార్థించే సన్నివేశాలతో సాగిన ఈ గ్లింప్స్ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత బలంగా చూపించింది. చివర్లో అమ్మవారి దర్శనాన్ని చూపించిన తీరు ప్రేక్షకుల్లో భక్తి భావనతో పాటు గూస్‌బంప్స్ కలిగించేలా ఉంది. ఇప్పటివరకు కామెడీతో అలరించిన బ్రహ్మానందం ఈ సినిమాలో భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారనే ఆసక్తిని పెంచింది. మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.
