పార్దీ గ్యాంగ్ లో ఇద్దరు అరెస్ట్.. మొయినాబాద్ లో తాళం వేసిన ఇళ్లలో చోరీలు

పార్దీ గ్యాంగ్ లో ఇద్దరు అరెస్ట్.. మొయినాబాద్ లో తాళం వేసిన ఇళ్లలో చోరీలు

చేవెళ్ల, వెలుగు: తాళం వేసిన ఇండ్లు, షట్టర్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న పార్దీ గ్యాంగ్ లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆదివారం మొయినాబాద్​ పీఎస్​లో డీసీపీ యోగేశ్​ గౌతమ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 11న శంకర్​పల్లి మండలం ఎల్వర్తి గ్రామంలోని ఓ ఇంటి తాళాలు పగులగొట్టి అల్మారాలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు ఎత్తుకెళ్లారు. 

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు ఆదివారం మహారాష్ట్రకు చెందిన పార్దీ గ్యాంగ్​కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎల్వర్తితో పాటు ఆరు నెలలుగా శంకర్​పల్లి, బీడీఎల్​ భానూర్, గజ్వేల్  పరిసర ప్రాంతాల్లో  11 చోరీలు చేసినట్లు ఒప్పుకున్నారు. వారి నుంచి రూ.5 వేల నగదు, అర తులం బంగారం, చోరీకి ఉపయోగించిన రాడ్ ను స్వాధీనం చేసుకున్నారు. 

సోలాపూర్​కు చెందిన విశాల్​ భగవత్​ షిండే(19),  జాల్నా జిల్లాకు చెందిన కృష్ణ దండేకర్(19) పట్టుబడగా.. శివాజీ భోంస్లే, రాహుల్  విజయ్  పవార్, అతని మామ, జమున పరారీలో ఉన్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. మహారాష్ట్రలోని సోలాపూర్, జాల్నా జిల్లాలకు చెందిన ఆరుగురితో కూడిన ఈ గ్యాంగ్​ శంకర్ పల్లి, లింగంపల్లి, టోలిచౌకీ ప్రాంతాల్లో ఉంటూ, పగలు రెక్కీ నిర్వహించి రాత్రి దొంగతనానికి వెళ్తారని తెలిపారు.