E20 పెట్రోల్ వల్ల అసలు ఎవరికి లాభం.. ఎవరి జేబులపై ఎలా భారం పడుతోంది?

E20 పెట్రోల్ వల్ల అసలు ఎవరికి లాభం.. ఎవరి జేబులపై ఎలా భారం పడుతోంది?

దేశంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన కీలకమైన అంశాల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఒకటి. ముఖ్యంగా 20 శాతం ఇథనాల్‌ను కలిపిన E20 పెట్రోల్ రాకతో సామాన్యులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటో కంపెనీలు కూడా కేంద్రానికి ఇథనాల్ బ్లెండ్ పెట్రోల్ ఇబ్బందులపై అలర్ట్ చేశాయి. ఈ విధానం వల్ల ఎవరికి మేలు జరుగుతోంది? ఎవరిపై భారం పడుతోంది? అనే దానిపై జరుగుతున్న చర్చ ఇప్పుడు రాజకీయంగా, ఆర్థికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ20 పెట్రోల్ వల్ల నేరుగా నష్టపోతున్న వారు వాహనదారులే. ఇథనాల్‌లో ఉండే కెలొరిఫిక్ విలువ స్వచ్ఛమైన పెట్రోల్ కంటే సుమారు 36 శాతం తక్కువగా ఉంటుంది. దీనివల్ల సాధారణ పెట్రోల్‌తో వచ్చే మైలేజ్‌తో పోలిస్తే.. ఈ20 వాడినప్పుడు కనీసం 8 శాతం వరకు మైలేజ్ పడిపోతుంది. అంటే ఒకే దూరం ప్రయాణించడానికి వాహనదారులు దాదాపు 8 శాతం ఎక్కువ ఇంధనాన్ని కొనాల్సి ఉంటుంది. ఫలితంగా ఖర్చు కూడా అదే స్థాయిలో పెరుగుతుంది.

మైలేజ్ తగ్గడమే కాకుండా.. పాత మోడల్ వాహనాల ఇంజన్లపై ఈ20 ఇంధనం తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా BS-IV లేదా అంతకంటే పాత వాహనాల్లో ఉండే రబ్బరు పైపులు, సీల్స్, ఫ్యూయల్ పంపులు త్వరగా తుప్పు పట్టేస్తున్నాయి. దీనివల్ల వాహనదారులకు తరచూ మెకానిక్స్ వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ద్విచక్ర వాహనాలకు రూ.3వేల వరకు, కార్లకు రూ.6వేలకు పైబడి రిపేరు ఖర్చులు భరించాల్సి వస్తోంది. పెట్రోల్ బంకుల్లో కేవలం ఈ20 మాత్రమే లభిస్తుండటంతో ప్రత్యామ్నాయం లేక వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.

రైతులకు ఒరిగేదేమిటి?
ఇథనాల్ తయారీకి చెరకు, మొక్కజొన్న, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తులను ముడిసరుకుగా వాడుతున్నారు. ఈ విధానం వల్ల రైతులకు నేరుగా భారీ లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. చెరకు రైతులు ఎప్పట్లాగే మద్దతు ధరకు మిల్లులకు విక్రయిస్తున్నారు తప్ప.. ఇథనాల్‌తో వారికి అదనపు ఆదాయం రావడం లేదని తేలిపోయింది. ఇక మొక్కజొన్నలను నేరుగా ప్రభుత్వానికి కాకుండా డిస్టిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఉర్జాదాతలుగా మారుతున్నప్పటికీ.. మార్కెట్లో లభించే ధరలు రైతులకు ఆశించిన స్థాయిలో మేలు చేయడం లేదు. అంతేకాకుండా మొక్కజొన్న సాగు పెరగడం వల్ల పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు తగ్గిపోతున్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే వీటిని వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవటం పెరుగుతోంది. ఇక్కడ క్రూడ్ దిగుమతులకు బదులుగా ఎక్కువ విలువ కలిగిన వంటనూనెలు, పప్పుధాన్యాలు దిగుమతులు పెరుగుతున్నాయ్. 

అసలు లబ్ధిదారులు డిస్టిల్లర్లే..
ఈ ఇథనాల్ విధానం ద్వారా అసలైన లాభం పొందుతున్న వారు డిస్టిల్లర్లు, పెట్రోలియం కంపెనీలే. ప్రభుత్వం నుంచి గ్యారెంటీ కొనుగోలు ఒప్పందాలు, రాయితీలు పొందడంతో డిస్టిల్లర్లు భారీ ఎత్తున ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకున్నారు. ప్రస్తుతం దేశంలో అవసరానికి మించి ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం ఉండటంతో.. డిస్టిల్లర్లు ఈ విధానాన్ని బలంగా సమర్థిస్తున్నారు. సరిపోను ముడిసరుకు దేశంలో లభించక పోవడంతో విదేశాల నుంచి మొక్కజొన్నలు, ఇథనాల్ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా డాలర్లు ఖర్చు చేసే వ్యవహారమే. అంటే క్రూడ్ దిగుమతులకు బదులు ఆహార దిగుమతులు పెరుగుతున్నాయ్ అన్నమాట. 

పర్యావరణ పరంగా ఇథనాల్ ఉద్గారాలను తగ్గిస్తుందనే వాదన ఉన్నప్పటికీ.. దీనివల్ల ఆహార భద్రత, నీటి వనరుల వినియోగం, వాహనాల నిర్వహణ వంటి అనేక ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చైనా సహా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. భారతదేశంలో కూడా ఈవీల వాడకం క్రమంగా పెరుగుతోంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం దేశం భవిష్యత్తుకు అవసరమైన సాంకేతికతలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇథనాల్ పేరుతో క్రూడ్ దిగుమతులు తగ్గినా వాటి స్థానంలో వంటనూనెలు, పప్పుదినుసులు, మెుక్కజొన్న లాంటి దిగుమతులు చేరుతూ మోడీ ప్రభుత్వం చెబుతున్న దిగుమతి భారం తగ్గుతాయ్ అనేది ఊహాజనితమైన కల్పనని తేలిపోయింది. ఇక్కడ ఇథనాల్ తయారు చేస్తున్న కంపెనీలు, ఆయిల్ రిఫైనింగ్ కంపెనీలే ఈ20 పెట్రోల్ వల్ల లాభపడుతున్నాయ్. దీనికి తోడు ఆటో స్పేర్స్ కంపెనీలకూ మంచి బిజినెస్ దొరుకుతోంది వాహనాల రిపేర్లు పెరిగి.