అధికారుల చిన్న తప్పు.. పెద్ద నష్టానికి దారితీసింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనా లోపాలు రాష్ట్రంలో వేలాది మంది ఆస్తిదారులకు తీవ్ర మానసిక క్షోభను, భారీ ఆర్థిక నష్టాన్ని మిగులుస్తున్నాయి. భూములు, స్థలాల వర్గీకరణలో చోటుచేసుకున్న ఒక సాంకేతిక తప్పిదం ఇప్పుడు సామాన్యుల పాలిట పెద్ద శాపంగా మారింది. గతేడాది హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ శాఖ సెక్షన్ 22-ఏ నిషేధిత భూముల జాబితాను అప్డేట్ చేసింది. అప్పటి నుంచి ప్రధానంగా నాన్-అగ్రికల్చర్ (వ్యవసాయేతర) నిషేధిత జాబితా తయారీలో అధికారులు అనుసరించిన విధానమే ఈ గందరగోళానికి కారణమైంది. మొత్తం భూవిస్తీర్ణంలో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ, నిషేధిత జాబితాలో చేరిన సర్వే నంబర్ల సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. గతంలో ప్రభుత్వం సక్రమంగా క్రమబద్ధీకరించినవి, పేదలకు జీవోలు 166, 59 ద్వారా పట్టాలిచ్చినవి, సీలింగ్ సర్ ప్లస్, భూదాన్ భూములు సైతం ఈ బ్లాక్ లిస్టులోకి చేరాయి.
ఇనాం భూముల తలనొప్పులు
రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22(1) విభాగంలో ఏ నుంచి ఇ వరకు ఐదు రకాల భూములను (ఎ. అసైన్డ్, బి. ప్రభుత్వ, అటవీ, సి. వక్ఫ్, దేవాదాయ, డి. సీలింగ్ మిగులు, ఇ. భూసేకరణ, కోర్టు కేసులు) విభజించారు. 2025 డిసెంబరు నాటికి నమోదైన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 91,15,723 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. అంతకుముందు పాత జాబితాలో ఇది 95,85,033 ఎకరాలుగా ఉన్నది. అర్బన్ ప్రాంతాల విషయానికొస్తే కొత్త జాబితా ప్రకారం 86,664 ఎకరాలు, పాత జాబితా ప్రకారం 1.31 లక్షల ఎకరాల విస్తీర్ణం నిషేధిత జాబితాలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ముఖ్యంగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్‌సీ) భూములు, ఇనామ్, అసైన్డ్, చెరువు శిఖం, బఫర్ జోన్లతో కలిసి ఉన్న ప్రైవేటు భూములను వేరు చేయకపోవడంతో ప్రైవేటు పట్టాదారులు నష్టపోతున్నారు.
ఇప్పుడిచ్చే లిస్ట్‌లో బైనంబర్, పేరు, విస్తీర్ణం ఉంటే రిజిస్ట్రేషన్
ఇటీవలి కాలంలో వివిధ జిల్లాల్లో నిషేధిత భూముల జాబితాపై వివాదాలు తీవ్రం కావడం, బాధితుల నుంచి నిత్యం వినతులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. సమస్య తీవ్రతను గుర్తించి ప్రస్తుతం జిల్లా కలెక్టర్లు సదరు రికార్డులను పునఃపరిశీలించే పనిలో పడ్డారు. ఎక్కడెక్కడ సాంకేతిక లోపాలు తలెత్తాయో గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు. గతంలో జీవోలు 166, 59 ద్వారా క్రమబద్ధీకరణ పూర్తయి రిజిస్ట్రేషన్లు జరిగిన స్థలాలను, బేస్ సర్వే నంబర్ల నుంచి వేరుపడిన ప్రైవేటు స్థలాలను గుర్తించి నివేదికలు తయారు చేస్తున్నారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదులను క్షేత్రస్థాయి సరిహద్దులతో సరిపోల్చుతున్నారు. జిల్లా కలెక్టర్లు గ్రామాల వారీగా రూపాంతరం చేసిన తుది సవరణ జాబితాను ప్రభుత్వానికి నివేదించనున్నారు. ప్రభుత్వం ఆ జాబితాను పరిశీలించి తుది ఆమోదం తెలిపిన తరువాత మాత్రమే నిషేధిత జాబితా ఆంక్షల నుంచి సామాన్యులకు విముక్తి లభించి, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎవరెవరికి పట్టాలు ఇచ్చారు. రెగ్యులరైజేషన్ చేశారు. సర్ ప్లస్ ల్యాండ్‌లో ఎవరున్నారు అనే వివరాలు పేర్లు, విస్తీర్ణంతో జాబితా రెడీ చేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లకు ఇస్తారు. వారికి ఆస్తులను ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశిస్తారు.
హైకోర్టు ఆదేశాలతోనే అమలు
ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్లతో చేతులు మారుతున్నట్టు పలు కేసుల్లో గుర్తించిన హైకోర్టు నిషేధిత భూముల జాబితాను అప్డేట్ చేయాలని 2015లో అప్పటి ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 2024లో మరోమారు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం 2025 డిసెంబర్ లో ప్రభుత్వ భూముల వివరాలను రెవన్యూ శాఖ నిషేధిత జాబితాలో చేర్చింది. తహసీల్దార్, ఆర్డీవో, జేసీ, కలెక్టర్ల సంతకాలతో కూడిన సర్వే నంబర్ల వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్ సైట్ లో అప్లోడ్ చేసింది. దీంతో 22ఏ కింద ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది.
