రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఇండస్ట్రియల్, టూరిజం హబ్‌గా మారుతోంది. ఇప్పటికే సీతారాంపురం, హైతాబాద్, మాచన్పల్లిలో 1,580 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, కొత్తగా మరో 993 ఎకరాలు సేకరించింది. ఇందులో 418 ఎకరాలు టీజీఐఐసీకి అప్పగించగా, పనులు ప్రారంభించేందుకు కసరత్తు మొదలైంది.
ప్రభుత్వం ఇప్పటికే చందన్వెల్లిలో 1,182, హైతాబాద్‌లో 200 ఎకరాలు, మాచన్పల్లిలో 200 ఎకరాలు సేకరించి టీజీఐఐసీ ద్వారా పలు కంపెనీలకు కేటాయించింది. చందనవెల్లిలో వెల్స్పన్ కంపెనీకు 375 ఎకరాలు, మైక్రోసాఫ్ట్ కు 52 ఎకరాలు, సీటీఆర్ఎల్ఎస్ డేటా సెంటర్‌కు 40 ఎకరాలు, ఎన్ఎక్స్ట్రా డేటాకు 40 ఎకరాలు, ఆశీర్వాద్ పైప్స్కు 25 ఎకరాలు, సీతారాంపురంలో కిటెక్స్ఆప్పరల్ పార్క్‌కు 250 ఎకరాలు, ప్రీమియం ఎనర్జీ సోలార్ లిమిటెడ్‌కు 75 ఎకరాలు కేటాయించారు. ఈ కంపెనీలు అన్నీ కార్యకలాపాలు ప్రారంభించాయి. ప్రీమీయం ఎనర్జీ కంపెనీని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్తగా సేకరించిన 418 ఎకరాల్లోనూ బడా కంపెనీలు ఏర్పాటు కానున్నట్లు సమాచారం.
ఎంజాయ్మెంట్ సర్వే ఆధారంగా భూసేకరణ
ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూమి తీసుకుంటుండగా, ఇప్పటికే దామెర్లపల్లిలో సర్వే నంబర్లు 303, 456, పెద్దవేడులో సర్వే నంబర్ 90, పోతుగల్ సర్వే నంబర్లు 93,183, హైతాబాద్ సర్వే నంబర్లు 8, 32, రేగడి దోస్వాడ సర్వే నంబర్102, తాళ్ల పల్లి సర్వే నంబర్ 483 నుంచి 993 ఎకరాలను సేకరించారు. దీంట్లో నుంచి టీజీఐఐసీ, టూరిజం డిపార్ట్మెంట్కు పోనూ మిగిలిన దాన్ని హెచ్ఎండీఏ ద్వారా లేఅవుట్లు వేసి ఒక్కో రైతుకు ఎకరాకు 800 గజాల చొప్పున కేటాయిస్తున్నారు. అయితే, చాలా మంది రైతులకు రికార్డులో ఎక్కువ విస్తీర్ణం ఉన్నప్పటికీ, కబ్జాలో మాత్రం పూర్తిగా లేదు.
కొందరు రైతులు రికార్డులో కన్నా కబ్జాలో ఎక్కువగా ఉన్నారు. అందుకే రైతుతో పాటు చుట్టుపక్కల రైతులకు నోటీసులు ఇచ్చి వారి సమక్షంలోనే ఎంజాయ్మెంట్ సర్వే చేసి సంతకాలు తీసుకుంటున్నారు. అంటే ఎంత విస్తీర్ణంలో కబ్జాలో ఉంటే అంత మేరకే నోటిఫై చేస్తున్నారు. రికార్డు, కబ్జా ఉన్నా రైతుకు ఎకరాకు 800 గజాల చొప్పున, రికార్డులో లేకున్నా కబ్జాలో ఉంటే 300 గజాల చొప్పున కేటాయిస్తున్నారు. లేఅవుట్ అనంతరం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామని అమ్ముకునే అవకాశం కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
