అసలు 22  ఏ భూములు అంటే ఏంటి.?ఎఫెక్ట్ ఎవరికి..? బేస్ సర్వే నంబర్ల బ్లైండ్ బ్లాకింగ్ హక్కులపై తీవ్ర ప్రభావం

అసలు 22  ఏ భూములు అంటే ఏంటి.?ఎఫెక్ట్ ఎవరికి..? బేస్ సర్వే నంబర్ల బ్లైండ్ బ్లాకింగ్ హక్కులపై తీవ్ర ప్రభావం

అధికారుల చిన్న తప్పు.. పెద్ద నష్టానికి దారితీసింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనా లోపాలు రాష్ట్రంలో వేలాది మంది ఆస్తిదారులకు తీవ్ర మానసిక క్షోభను, భారీ ఆర్థిక నష్టాన్ని మిగులుస్తున్నాయి. భూములు, స్థలాల వర్గీకరణలో చోటుచేసుకున్న ఒక సాంకేతిక తప్పిదం ఇప్పుడు సామాన్యుల పాలిట పెద్ద శాపంగా మారింది. గతేడాది హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ శాఖ సెక్షన్ 22-ఏ నిషేధిత భూముల జాబితాను అప్​డేట్ చేసింది. 

ఏమిటీ 22ఏ.. ఎఫెక్ట్ ఎవరికి?

రాష్ట్రంలో భూముల అక్రమ క్రమవిక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు నిర్దేశించిందే రిజిస్ట్రేషన్ల చట్టం-1908లోని ‘సెక్షన్ 22-ఏ’. ఇందులో ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, అటవీ, సీలింగ్, కోర్టు జప్తులో ఉన్న భూములుంటాయి. వాటిని ప్రైవేటు వ్యక్తులుఅమ్మడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని నిరోధించడానికే ‘నిషేధిత భూముల జాబితా’(22-ఏ)ను రూపొందిస్తారు. రెవెన్యూ పాత రికార్డులు (పహాణీలు, సేత్వార్), దేవాదాయ, వక్ఫ్ తదితర శాఖల అధికారులు సేకరించిన సర్వే నంబర్ల వివరాలను ముందుగా కలెక్టర్‌‌‌‌కు సమర్పిస్తారు. కలెక్టర్ వాటిని పరిశీలించి ఆమోదించిన అనంతరం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అధికారిక జాబితాను రిజిస్ట్రేషన్ శాఖకు అప్పగించి, సబ్‌‌‌‌రిజిస్ట్రార్ కార్యాలయాల ‘కార్డ్’ కంప్యూటర్ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌లో నమోదు చేస్తారు. ఇలా సిస్టమ్‌‌‌‌లో నమోదైన సర్వే నంబర్లలో ఉన్న ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు లేదా బ్యాంక్ మార్టిగేజ్‌‌‌‌ల కోసం దరఖాస్తు చేసినా సాఫ్ట్‌‌‌‌వేర్ ఆటోమేటిక్‌‌‌‌గా రిజిస్ట్రేషన్‌‌‌‌ను నిలిపివేస్తుంది.

బేస్ సర్వే నంబర్ల బ్లైండ్ బ్లాకింగ్.. హక్కులపై తీవ్ర ప్రభావం

రాష్ట్రంలోని అనేక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆయా భూములు, స్థలాలు గతంలో ఏదో ఒక రూపంలో ప్రభుత్వ భూముల జాబితాకు లింక్ అయి ఉండటమే ప్రస్తుత సమస్యకు ప్రధాన మూలం. కాలక్రమేణా ఆయా బేస్ సర్వే నంబర్ల నుంచి వేరుపడి ‘బై’ నంబర్లు (ఉప సర్వే నంబర్లు) ఏర్పడినప్పటికీ, హక్కుల నమోదులో సరైన స్పష్టత లేకపోవడంతో అధికారులు మొత్తం బేస్ సర్వే నంబర్‌‌‌‌నే 22-ఏ జాబితాలో వేశారు. కొన్ని ప్రాంతాల్లో అసైన్డ్, ప్రభుత్వానికి చెందిన భూముల్లో ఏళ్ల క్రితమే నివాసాలు వెలిశాయి. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఈ ఇంటి నంబర్ల వివరాలు నమోదు కాకపోవడంతో, అధికారులు కేవలం పాత సర్వే నంబర్లను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని నిషేధిత జాబితా రూపొందించారు. ఫలితంగా, చట్టబద్ధంగా ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న వేలాది మంది బాధితుల ఇళ్లు కూడా 22ఏ ఉచ్చులో చిక్కుకుపోయాయి. గతంలో ప్రభుత్వ స్థలాలను, సర్ ప్లస్ భూములను ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం వివిధ జీవోల (ముఖ్యంగా జీవో 166, జీవో 59) ద్వారా క్రమబద్ధీకరించి, చట్టబద్ధ పట్టాలను మంజూరు చేసింది.

ఒకే సర్వే నంబర్‌‌‌‌లోని కొంత భాగాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరించగా, మరికొంత భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండిపోయింది. అయితే, అధికారులు నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణ పూర్తయిన ఇండ్ల స్థలాలను ప్రభుత్వ భూముల జాబితా నుంచి రికార్డుల పరంగా వేరు చేయడంలో విఫలమయ్యారు. రికార్డులను అప్‌‌‌‌డేట్ చేయకపోవడంతో ఆ సక్రమ ఆస్తులు కూడా నిషేధిత జాబితాలోనే ఉండిపోయాయి. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి నేరుగా వేలం పాటల ద్వారా కొనుగోలు చేసిన స్థలాలు, పట్టాలు పొందినవి చట్టప్రకారం ప్రైవేటు ఆస్తులుగా మారాల్సి ఉండగా, రెవెన్యూ రికార్డుల్లో బేస్ సర్వే నంబర్లు ఇప్పటికీ ప్రభుత్వ భూములుగానే దర్శనమిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద మొన్నటి వరకు ఇవి బై నంబర్లతో, లేఅవుట్ నంబర్లతో చేతులు మారాయి. ఆ క్రమంలో చాలా అక్రమాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం బేస్ సర్వే నంబర్ నిషేధిత జాబితాలో చేర్చి ఏదీ కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదని స్పష్టం చేశారు.