దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ.. సోషల్ మీడియాలో హోరెత్తుతోంది..!

దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ..  సోషల్ మీడియాలో హోరెత్తుతోంది..!

సోషల్ మీడియా వేదికగా రోజుకో పార్టీ పుట్టుకొస్తుంది. మొన్నటికి మొన్న కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది.. హంగామా చేస్తోంది.. ప్రశ్నిస్తుంది.. ప్రభుత్వాన్ని వంచుతుంది. నిన్నటికి నిన్న స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలో సాయుధ నక్సలిజం అంతమైందని.. ఆ స్థానంలో దిమాగీ నక్సల్స్ పొంచి ఉన్నారంటూ కామెంట్ చేశారు. దీని వల్ల సోషల్ మీడియాతోపాటు సంప్రదాయ రాజకీయ వేత్తలు, రాజకీయ నిపుణులు తమ తమ అభిప్రాయాలతో విరుచుకుపడుతున్నారు. ప్రశ్నించే వాళ్లు దిమాగీ నక్సల్స్ అవుతారా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. 

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. జస్ట్ 24 గంటల్లోనే 2 లక్షల ఫాలోవర్స్ సంపాదించింది. దిమాగీ నక్సల్ జనతా పార్టీ అనే ఇన్ స్ట్రాగ్రామ్, ఎక్స్ హ్యాండిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మేం భగత్ సింగ్ అనుచరులం.. ఒక వేళ వాళ్లు మా అకౌంట్లను బ్లాక్ చేసినా.. నిలిపివేయటానికి ప్రయత్నించినా లేదా మమ్మల్ని దేశ ద్రోహులుగా ముద్ర వేసినా.. అలాంటి వాళ్లు భగత్ సింగ్ ను అవమానించినట్లే అంటూ నోట్ రిలీజ్ చేసింది దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ. 

కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే.. ఇప్పుడు దిమాగీ నక్సల్స్ పదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు దిమాగీ నక్సల్స్ అంటే ఏంటీ అంటూ లక్షల మంది దాన్ని సెర్చ్ చేస్తున్నారు. దిమాగీ నక్సల్స్ అని ప్రధాని మోదీ ఎందుకు అన్నారు అనేది వెతుకుతున్నారు. అడవుల నుంచి సాయుధ నక్సల్స్ ను ఏరివేసి.. ఆ సంక్షోభం నుంచి దేశాన్ని విముక్తి చేయటంలో విజయం సాధించామని గర్వంగా చెప్పిన ప్రధాని మోదీ.. దానికి కొనసాగింపుగా సాయుధ నక్సల్స్ పోయినప్పటికీ మేధావి నక్సల్స్ ఇంకా పొంచి ఉన్నారు.. జనం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

ప్రధాని మోదీ దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యల తర్వాత.. ప్రశ్నించే వాళ్లు.. సమస్యలను లేవనెత్తుతున్న వాళ్లు, ప్రతిపక్షాలు అన్నీ మేం దిమాగీ నక్సల్స్ అంటూ కామెంట్స్ చేశారు. మాజీ ఆర్థిక, హోం శాఖ మంత్రి పి.చిదంబరం అయితే నేను దిమాగీ నక్సల్ గా ఉండటానికి గర్వపడుతున్నాను అంటూ కామెంట్ చేశారు. కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, నటుడు ప్రకాష్ రాజ్ వంటి అందరూ దిమాగీ నక్సల్స్ అంటూ ప్రశ్నించటంతో ఇప్పుడు ఇది.. కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే వైరల్ అవుతుంది.. ట్రెండ్ అవుతుంది.