కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికర పథకాలు సాధ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలను మరింత సమర్థవంతంగా కొనసాగిస్తామని ఆయన తేల్చిచెప్పారు.
అయితే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక ప్రైవేట్ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పేదరికంపై పోరాడుతున్న ఇలాంటి సంక్షేమ పథకాలపై కోర్టులో కేసులు వేయడం వెనుక ఉన్న ఉద్దేశాలను ఆయన ప్రశ్నించారు. ఈ పిటిషన్‌పై అధికారులు ఎందుకు సకాలంలో కౌంటర్ దాఖలు చేయలేదనేదానిపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించిందని, దీనిపై అంతర్గతంగా ఆరా తీస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఎప్పుడూ ఎలాంటి బేషజాలకు పోకుండా, కేవలం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని మంత్రి పునరుద్ఘాటించారు. రాజకీయాలకు అతీతంగా, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఎన్ని అడ్డంకులు ఎదురైనా, పేదల బతుకుల్లో వెలుగులు నింపే సంక్షేమ పథకాలను ఆపే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షేమనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
