తమిళనాడు రాజకీయ చరిత్రలో నూతన శకానికి తెరతీస్తూ... ముఖ్యమంత్రిగా విజయ్ తన పాలనలో విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకున్నారు. దశాబ్దాలుగా రెండు ప్రధాన పార్టీల మధ్యే నడిచిన రాజకీయాన్ని మారుస్తూ, ప్రజానాయకుడిగా బాధ్యతలు చేపట్టిన విజయ్... తన తొలి వంద రోజుల్లోనే సంచలన నిర్ణయాలతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలపై సీఎం విజయ్ దృష్టి పెట్టారు. గృహ వినియోగదారులకు ప్రతి రెండు నెలలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా సింగపెన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, అలాగే విద్యాసంస్థలు, ఆలయాల సమీపంలో ఉన్న 717 టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయడం వంటి కీలక ఫైళ్లపై తొలి రోజే సంతకాలు చేశారు.
రైతన్నల సంక్షేమం కోసం రూ. 6,000 కోట్ల వరకు పంట రుణాలను మాఫీ చేయడంతో పాటు, సన్నకారు రైతులకు పెద్దపీట వేశారు. అంతేకాకుండా, ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే శిశువులకు బంగారు ఉంగరం అందించే 'తాయ్ మామన్ తంగ మోతిరం' పథకం, వివాహ కానుకగా బంగారు నాణెం, పట్టు చీరల పథకాలను ప్రకటించారు. యువత నైపుణ్యాభివృద్ధికి, విద్యార్థులకు లాప్‌టాప్‌లు సైకిళ్ల పంపిణీకి పెద్దఎత్తున నిధులు కేటాయించారు.
కేవలం సంక్షేమమే కాకుండా, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా 'వెట్రి తమిళనాడు' ఇన్వెస్టర్స్ కాంక్లేవ్ ద్వారా ఏకంగా లక్ష కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం విజయవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి తావులేకుండా, పారదర్శకమైన పాలన అందించడమే తమ లక్ష్యమని విజయ్ స్పష్టం చేశారు.ప్రజలే పాలకులు, మేం కేవలం సేవకులమే అంటున్న ముఖ్యమంత్రి విజయ్ ప్రయాణంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
