కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వేంకటేశ్వరుని దర్శించుకోవడానికి లక్షలాది మంది వస్తుంటారు. భక్తులకు ప్రధానంగా ఏర్పడే సమస్య రూమ్స్. తిరుమల గదుల కోసం వేలాది మంది భక్తులు ఎదురుచూస్తూనే ఉంటారు. భక్తుల అవసరాన్ని కొన్ని దళా రీ గ్యాంగ్ లు క్యాష్ చేసుకుంటున్నాయి. కొంతమంది నకిలీ ఆధార్ కార్డులతో తిరుమలలో గదులను అక్రమంగా పొంది అధిక ధరలకు విక్రయిస్తున్న దళారీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
తిరుమల సీఆర్వో కార్యాలయం దగ్గర తిరుమల భక్తులకు రూం అలాట్ మెంట్ చేస్తారు. ఓ వ్యక్తి ఫేక్ ఆధార్‌తో గదులు పొంది వాటిని అధిక ధరకు వేరొకరి విక్రయిస్తున్న దళారీల ప్రయత్నాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు భగ్నం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఆగస్టు 16 వతేదీన సీఆర్వో కార్యాలయం దగ్గర భక్తులు బారులు తీరారు.అక్కడ పర్యవేక్షిస్తున్న విజిలెన్స్ సిబ్బందికి అప్పటికే ఓ గదిని తీసుకున్న ఒక వ్యక్తి మళ్లీ గదికోసం క్యూలో ఉండటాన్ని గమనించారు. వెంటనే అతని వివరాలు సేకరించి .. రెండు ఫేక్ ఆధార్ కార్డ్లు.. గది రిజిస్ట్రేషన్ స్లిప్, రూ. 800 లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కేరళ మలప్పురం జిల్లాకు చెందిన పీఎం ఆషిక్ అలీ(32) గా గుర్తించారు.
తనకు ఒక్కో గదికి రంజిత్ అనే దళారీ వెయ్యిరూపాయిలు ఇచ్చే ప్రాతిపదికిన నియమించుకున్నట్లు నిందితేడు ఆషిక్ తెలిపాడు. ఫేక్ డాక్యుమెంట్స్ తో గదులు తీసుకొని వాటిని దళారీ గ్యాంగ్ కు అప్పగిస్తానని.. ఆ గదులను దళారీలు అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తారని తమ విచారణలో నిందితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు. ఇంకా గ్యాంగ్‌లోని ఇతర సభ్యులను విచారిస్తున్నారు. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి.. దళారీ గ్యాంగ్ వ్యవహారాన్ని ఆరీ తీస్తున్నారు.
తిరుమలలో వసతి గదులు భక్తుల కోసమేనని టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారామాత్రమే కొనుగోలు చేయాలని.. దళారుల ద్వారా కొనుగోలు చేయకూడదని టీటీడీ అధికారులు తెలిపారు. ఆధార్, ఫొటోలు, ఫోన్ నంబర్లు వంటి వ్యక్తిగత వివరాలను అపరిచితులకు ఇవ్వకూడదని, అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే తిరుమలలో గదులు పొందాలని టీటీడీ తెలిపింది.భక్తులను మోసగించే దళారులు, వారికి సహకరించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ విజిలెన్స్ అధికారులు తెలిపారు.
దళారులు అధిక ధరలకు రూం ఇప్పిస్తామని సంప్రదించినా లేదా అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే టీటీడీ విజిలెన్స్ & సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ నెం: 9866898630 లేదా టీటీడీ కాల్ సెంటర్ నెం : 155257 కు సమాచారం ఇవ్వాలని టీటీడీ అధికారులు తెలిపారు.
