- పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు
- ఏపీ, తెలంగాణ టాప్..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యాన్ని పంచాల్సిన పండ్లు, కూరగాయలే అనారోగ్యానికి కారణమవుతున్నాయి. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో పాటు వాటిలో విషపూరిత రసాయనాలు చేరుతున్నాయి. మనం తినే పండ్లు, కూరగాయల్లో పురుగుమందుల అవశేషాలు మోతాదుకు మించి ఉంటున్నట్లు తేలింది. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలే అగ్రస్థానంలో ఉన్నట్లు ఇటీవల లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన డేటా ద్వారా స్పష్టమైంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నివేదిక ప్రకారం.. ఉండాల్సిన దానికన్నా మన దగ్గర పండుతున్న పండ్లు, కూరగాయల్లో పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
తెలంగాణలో 5.9 శాతం అవశేషాలు
రాష్ట్రంలో మొత్తంగా 8,198 శాంపిళ్లను పరిశీలించగా.. అందులో 486 శాంపిళ్లలో నిర్దేశించిన పరిమితికన్నా పురుగుమందుల అవశేషాలున్నట్లు తేలింది. మొత్తం శాంపిళ్లలో ఈ వాటా 5.9 శాతంగా ఉండటం గమనార్హం. మిగతా వాటిలో లేవని కాదు.. వాటిలోనూ ఎంతో కొంత పరిమాణంలో పెస్టిసైడ్స్ ఉంటున్నట్లు కేంద్రం వెల్లడించిన నివేదికలో తేలింది. జాతీయ సగటు 3.1 శాతంతో పోలిస్తే మన రాష్ట్రంలో ఈ అవశేషాలు ఎక్కువగా ఉండడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. మన రాష్ట్రంలో హెక్టారుకు అరకిలోకుపైగానే (530 గ్రాములు) పురుగుమందులను వాడుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా సగటు చూసుకుంటే 0.277 కిలోలు మాత్రమే ఉండగా.. మనం వాడుతున్నది దానికంటే రెట్టింపు కావడం గమనార్హం.
జాతీయ స్థాయిలో భారీగా శాంపిళ్ల పరిశీలన
కేంద్ర ప్రభుత్వం 2005–2006 నుంచి ‘మానిటరింగ్ ఆఫ్ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఎట్ నేషనల్ లెవల్’ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గత మూడేండ్లలో (2023 నుంచి 2026 వరకు) దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 70,652 పండ్లు, కూరగాయల నమూనాలను సేకరించి ల్యాబొరేటరీలలో పరీక్షించింది. ఆ మొత్తం శాంపిళ్లలో 2,223 నమూనాల్లో (3.1%) ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలకు మించి పెస్టిసైడ్స్ ఉన్నట్లు కేంద్రం నివేదిక తేల్చింది. తెలంగాణ తర్వాత కర్నాటకలో 334 శాంపిళ్లు (3.6%), మహారాష్ట్రలో 260 శాంపిళ్లు (4.9%), గుజరాత్‌లో 170 శాంపిళ్లలో (2.8%) పెస్టిసైడ్స్ అవశేషాలున్నట్లు తెలిపింది. ఏపీలో పరీక్షించిన 2,104 శాంపిళ్లలో 134 నమూనాలు (6.4%), హర్యానాలో 2,371 శాంపిళ్లకుగానూ 152 శాంపిళ్లలో అధికంగా పురుగుమందు ఆనవాళ్లు ఉన్నట్లు వెల్లడించింది. ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మాత్రం ఒక్క శాంపిల్‌లోనూ పెస్టిసైడ్స్ లేవని కేంద్రం చెప్పడం విశేషం.
భారీగా పెరుగుతున్న వినియోగం..
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్) విడుదల చేసిన ‘అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్–2024’ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో పురుగుమందుల వినియోగం భారీగా పెరిగింది. 2022–23లో రాష్ట్రంలో సుమారు 4,920 టన్నుల టెక్నికల్-గ్రేడ్ పురుగుమందులను వినియోగించారని ఆ నివేదిక చెబుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. అంటే సగటున హెక్టారుకు 530 గ్రాముల పెస్టిసైడ్స్ వాడుతున్నట్లు తెలిపింది. పరిమితికి మించిన రసాయనాలు శరీరంలో చేరడం వల్ల క్యాన్సర్, నాడీ సంబంధిత (న్యూరోలాజికల్) వ్యాధులు, హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
