- ‘విమల్’ను ప్రచారం చేసినందుకు షారుఖ్ ఖాన్,
- అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డీఏ నోటీసులు
- నిషేధిత పాన్ మసాలా బ్రాండ్ ప్రమోషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశం
- 15 రోజుల్లోగా స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
- సోషల్ మీడియా అకౌంట్ల నుంచి యాడ్ పోస్టులు తొలగించాలని సూచన
ముంబై:రాష్ట్రంలో నిషేధిత పాన్ మసాలా ఉత్పత్తులను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు 15 రోజుల్లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 2024లో విమల్ అనే పాన్ మసాలా కంపెనీకి చెందిన యాలకుల (ఇలాచీ)ను ప్రచారం చేసే ఒక యాడ్ కోసం ఈ ముగ్గురు నటులు కలిసి పనిచేశారు. ఈ మేరకు తుకారాం ముండే నేతృత్వంలోని మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం ఈ వ్యవహారంపై 9 పేజీల సమగ్ర నోటీసును జారీ చేసింది. ‘‘ఈ యాడ్ నేరుగా విమల్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది ప్రధానంగా నిషేధిత పాన్ మసాలాతో ముడిపడి ఉన్న బ్రాండ్. ఇలాంటి యాడ్స్ వినియోగదారులను తప్పుదోవ పట్టించడంతో పాటు నిషేధిత ఉత్పత్తులకు పరోక్ష ప్రచారంగా మారుతాయి” అని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది.
ఈ నిషేధిత పాన్ మాసాలా ప్రచారాల నుంచి వెంటనే తప్పుకోవాలని, అలాగే, తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వాటికి సంబంధించిన అన్ని ప్రచార కంటెంట్‌ను తొలగించాలని నటులను ఆదేశించింది. ఈ ప్రచార ఒప్పందాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు, క్యాంపెయిన్ వివరాలు, చెల్లింపుల ఒప్పందాలు, బ్రాండ్ స్వీకరణకు ముందు చేపట్టిన విచారణ ఆధారాలను 15 రోజుల్లోగా సమర్పించాలని, లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్‌డీఏ హెచ్చరించింది. వినియోగదారుల రక్షణ చట్టాల ప్రకారం తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రచారాలకు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు జరిమానాతో పాటు మూడేండ్ల పాటు ఎలాంటి వాణిజ్య ప్రకటనల్లో నటించకుండా నిషేధం విధించే అవకాశం ఉంది. కాగా, మహారాష్ట్రలో పాన్ మసాలా తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలపై పూర్తి నిషేధం అమల్లో ఉంది.
గతంలో అక్షయ్ కుమార్ క్షమాపణలు..
2022లో ఇదే విమల్ ఇలాచీ యాడ్‌లో కనిపించినందుకు నటుడు అక్షయ్ కుమార్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. దీంతో ఆయన బహిరంగ క్షమాపణలు చెబుతూ
ఆ బ్రాండ్ ప్రమోషన్ల నుంచి వైదొలిగారు. ప్రకటన ద్వారా వచ్చిన పారితోషికాన్ని మంచి ఆశయం కోసం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనల ఎంపికలో అత్యంత జాగ్రత్తగా ఉంటానని అప్పట్లో ఆయన పేర్కొన్నారు.
