‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాకి నిజమైన హీరోలు ప్రేక్షకులే అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘ఈ కథ విన్నప్పటి నుంచే నా హృదయానికి చాలా దగ్గరైంది. ఇలాంటి సమయంలో ఒక కుటుంబ కథా చిత్రం చేసి, దానిని విజయవంతం చేసినందుకు మూవీ టీమ్‌కు అభినందనలు.
ఈ సినిమాలో నాలుగు పిల్లర్స్ ఉన్నాయి. ఒక పిల్లర్ సూర్య గారైతే, ఇంకో పిల్లర్ రాధిక గారు, మూడో పిల్లర్ రవీనా టాండన్ గారు, ఇంకో పిల్లర్ మమితా బైజు. సూర్య గారిది చాలా డిఫికల్ట్ క్యారెక్టర్. కొంచెం కూడా ఎక్కువ చేయకూడదు. అలా అండర్ పెర్ఫార్మ్ చేయడం చాలా కష్టం. అలాంటి పాత్రలో సూర్య గారు అద్భుతంగా నటించారు. సూర్య గారి సినిమా నిర్మాణంలో మా ప్రొడక్షన్ పేరు కూడా ఉన్నందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పారు. సూర్య మాట్లాడుతూ ‘ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు. ఈ సినిమా ద్వారా కుటుంబ కథా చిత్రాలకు ప్రేక్షకులు మరోసారి పెద్దపీట వేశారు. అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. కొన్ని సినిమాలను కేవలం వసూళ్లతో కొలవలేం. ప్రేక్షకులు సినిమా చూసి పొందిన అనుభూతిలోనే అసలు విజయం ఉంటుంది’ అని అన్నాడు. ఈ చిత్ర విజయ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని రవీనా టాండన్ అన్నారు. రోజు రోజుకు వసూళ్లు పెరగడం ఆనందంగా ఉందని దర్శక నిర్మాతలు అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
