- 822 డ్రోన్లను కూల్చేశామన్న రష్యా
- ఆరుగురు మృతి.. భారీగా ఆస్తి నష్టం
మాస్కో : రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి చేసింది. యుద్ధం మొదలైన తర్వాత జరిగిన అతిపెద్ద ఎయిర్ అటాక్లలో ఇదొకటని రష్యా అధికారులు తెలిపారు. మాస్కో, రోస్టోవ్ ప్రాంతాలపై వందలాది డ్రోన్లు దాడి చేయడంతో కనీసం ఆరుగురు చనిపోయారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఉక్రెయిన్ దాదాపు వెయ్యి డ్రోన్లు ప్రయోగించింది.
రష్యా రక్షణ శాఖ ప్రకారం.. దేశవ్యాప్తంగా 822 డ్రోన్లను కూల్చేశారు. వీటిలో సుమారు 600 మాస్కో వైపు వచ్చినట్లు మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. మాస్కో రీజియన్‌లో 201 డ్రోన్లను కూల్చినట్లు ఆయన చెప్పారు. పొడోల్స్క్‌లో డ్రోన్ ఓ ఇంటిని ఢీకొట్టడంతో 83 ఏండ్ల వ్యక్తి చనిపోయాడని, పలువురు గాయపడ్డారని మాస్కో రీజియన్ గవర్నర్ ఆండ్రే వొరోబ్యోవ్ తెలిపారు.
పొడోల్స్క్‌లోని వైల్డ్‌బెర్రీస్‌కు చెందిన భారీ గోడౌన్, డొమోడెడోవో సమీపంలోని మరో గిడ్డంగి కూడా ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి. మాస్కోలోని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రోస్టోవ్ ప్రాంతంలోని మూడు పట్టణాలపై 150కిపైగా డ్రోన్లు దాడి చేశాయి. అక్కడ ఐదుగురు చనిపోయారు. ఇండ్లు, రైల్వే స్టేషన్ దెబ్బతినగా.. కొన్ని చోట్ల అడవిలోనూ మంటలు చెలరేగాయి.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు
ఉక్రెయిన్ దాడికి సమాంతరంగా రష్యా కూడా ఆ దేశంపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. క్రివీ రిహ్‌లోని ఉక్కు ఫ్యాక్టరీపై క్షిపణులు పడటంతో ఇద్దరు చనిపోయారు. 14 మంది గాయపడ్డారు.
పరిశ్రమలో కార్యకలాపాలు కొంత నిలిచిపోయాయి. సుమీ ప్రాంతంలో మరో వ్యక్తి చనిపోయారు. జపోరోజియా ప్రాంతంలో ఇంటిపై దాడి జరగడంతో ఇద్దరు మృతిచెందారు. కీవ్‌లో రష్యా క్షిపణి దాడులతో పలు చోట్ల మంటలు చెలరేగాయి.
ఓ పుస్తకాల మార్కెట్‌లో కొంత భాగం కాలిపోయింది. ఆరుగురు గాయపడ్డారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయని అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు.
ఆకాశాన్నంటిన అగ్నికీలలు
ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో రష్యాలోని అతిపెద్ద ఆన్‌లైన్ రిటైల్ కంపెనీ వైల్డ్‌బెర్రీస్‌కు చెందిన భారీ లాజిస్టిక్స్ గోడౌన్ ధ్వంసమైంది. మాస్కోకు 45 కిలోమీటర్ల దూరంలోని కోలెడినో ప్రాంతంలో ఉన్న ఈ గోడౌన్‌పై ఒకేసారి అనేక బాంబులు పడటంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.
భారీగా అగ్నికీలలు ఎగసిపడగా, దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. దీనిని సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఈ దాడి సమయంలో గోడౌన్లలో ఎవరూ లేరని, డాడులు జరగొచ్చన్న అంచనాలతో ముందుగానే ఉద్యోగులందరినీ తరలించామని వైల్డ్‌బెర్రీస్ తెలిపింది. గోదాముల్లోని కార్యకలాపాలను ఇతర కేంద్రాలకు మళ్లించినట్లు వెల్లడించింది.
