ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం పరిధిలో ఉన్న స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిల్‌కు 73వ మేయర్‌గా తెలంగాణకు చెందిన లా గ్రాడ్యుయేట్ సంధ్యా రెడ్డి ఎన్నికయ్యారు. దింతో ఆస్ట్రేలియాలో ఒక నగరానికి మేయర్‌గా ఎన్నికైన తొలి భారతీయ సంతతి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె ఈ పదవిలో మరో రెండేళ్ల పాటు కొనసాగుతారు.
సంధ్యా రెడ్డి సాధించిన ఈ గొప్ప విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆమెను "తెలంగాణ గర్వించదగ్గ కుమార్తె" అని అభివర్ణిస్తూ సోషల్ మీడియా 'X'లో శుభాకాంక్షలు తెలిపారు. "ఆస్ట్రేలియాలోని సిడ్నీ కౌన్సిల్ మేయర్‌గా ఎన్నికైన తెలంగాణ ముద్దుబిడ్డ సంధ్యా రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ సీఎం ట్విట్లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ & ఎంపీల ప్రశంసలు
సంధ్యా రెడ్డి మేయర్‌గా ఎన్నికవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఎంతో గర్వకారణమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా 'X'లో పోస్ట్ చేసింది.
సంధ్యా రెడ్డి సిడ్నీ ప్రజలకు మరింత శక్తివంతంగా సేవ చేయాలని, ఆమె పదవీకాలం దిగ్విజయంగా సాగాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆకాంక్షించారు.
బీజేపీకి చెందిన చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సంధ్యా రెడ్డి మేనకోడలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఆస్ట్రేలియాలో మేయర్‌గా ఎన్నికైన తొలి భారతీయ మహిళ నా మేనకోడలు కావడం నాకు, మా కుటుంబానికి ఎంతో గర్వకారణం. ఆమె నా నియోజకవర్గమైన చెవెళ్ల పరిధిలోని వికారాబాద్ జిల్లాకు చెందినవారు. గతంలో ఆమె ఆస్ట్రేలియాలో కౌన్సిలర్‌గా పనిచేసి ప్రజల ఆదరణ పొందారు" అని హర్షం వ్యక్తం చేశారు.
ALSO READ : ఇరాన్ యుద్ధం ముందు స్థాయికి క్రూడ్ సరఫరా
సంధ్యా రెడ్డి సొంత ఊరు తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మెల్లారెడ్డిగూడెం గ్రామం. ఆమె హైదరాబాద్‌లోని స్టాన్లీ కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1991లో ఆమె ఆస్ట్రేలియాకు వెళ్లాగా... అక్కడ రాజకీయాల్లోకి అడుగుపెట్టి, సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజాదరణ పొంది, ఇప్పుడు మేయర్ స్థాయికి ఎదిగారు.
