- ఇరాన్ మిలిటరీ సంచలన ప్రకటన
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ మిలిటరీ సంచలన ప్రకటన చేసింది. అమెరికా సైనికులను బంధించినా లేదా హతమార్చినా తమ దేశ పౌరులకు 30 వేల డాలర్లు బహుమతిగా ఇస్తామని ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ ప్రకటించారు. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ రిపోర్టు ప్రకారం.. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ ప్రణాళికను రూపొందించినట్టు ఆయన తెలిపారు. ఈ రివార్డు పథకంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించినట్టు హతామీ చెప్పారు. ధైర్యసాహసాలు ప్రదర్శించి అమెరికా సైనికులను పట్టుకున్న లేదా హతమార్చిన ఇరాన్ మహిళలకు సాధారణ మొత్తం కంటే రెట్టింపు 60 వేల డాలర్లు ఇస్తామన్నారు.
అటాక్‌లో వాడిన ఆయుధానికి రెట్టింపు ధర
ఈ దాడికి ఉపయోగించిన ఆయుధానికి కూడా ఇరాన్ ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపునిస్తోందని జెరూసలేమ్ పోస్ట్ రిపోర్టు వెల్లడించింది. దాడిలో వాడిన ఆయుధాన్ని దాని అసలు ధర కంటే రెట్టింపు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయడమే కాకుండా, సదరు వ్యక్తికి కొత్త ఆయుధాన్ని అందజేస్తారు. ఆ ఆయుధాన్ని భవిష్యత్తులో నిర్మించబోయే యుద్ధ మ్యూజియంలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తామని హామీ ఇచ్చారు.
