గౌతు లచ్చన్న అందరివాడు.. మహానీయులను మర్చిపోతున్నం: రిటైర్డ్ డీజీ పూర్ణచందర్ రావు

గౌతు లచ్చన్న అందరివాడు.. మహానీయులను మర్చిపోతున్నం: రిటైర్డ్ డీజీ పూర్ణచందర్ రావు
  •   24 బీసీ కులాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు
  •     రిటైర్డ్ డీజీ పూర్ణచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, సర్దార్ గౌతు లచ్చన్న వంటి మహనీయులను మర్చిపోతున్నామని, రాజకీయ నాయకులకు వస్తున్న గుర్తింపు మహనీయులకు దక్కడం లేదని  రిటైర్డ్ డీజీ పూర్ణచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాజమండ్రిలో నిర్వహించిన సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏపీలో బీసీల జనాభాపై ప్రభుత్వాలు వేర్వేరు లెక్కలు చెబుతున్నాయని, బీసీలు 50 శాతానికి పైగా ఉంటే 34 శాతం రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 50 శాతం సీలింగ్ ఉందని చెబుతూ బీసీల రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం బీసీల జనాభా 52 శాతంగా పేర్కొంటే.. ప్రస్తుత ప్రభుత్వం 50 శాతంగా చెబుతోందని, ఇందులో ఏ లెక్క వాస్తవమో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్రవర్ణాలకు చెందినవారే ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారని, దీంతో బీసీలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో జరిగిన అన్ని ఎన్నికల్లో కలిపి సుమారు 2,900 మంది ఎమ్మెల్యేలుగా గెలిస్తే.. వారిలో బీసీలు 498 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. 24 బీసీ కులాలకు ఇప్పటికీ చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదన్నారు. ఆదివాసీలకు పంపిణీ చేస్తున్న భూముల్లో సాగుకు అనుకూలమైనవి కాకుండా గుట్టలు, రాళ్లతో కూడిన భూములు ఇస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో బహుజన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. మెయిన్‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌ మీడియా మద్దతు లేకపోయినా సోషల్ మీడియా మనకు అండగా నిలుస్తోందన్నారు.