జనాభా లెక్కల్లో ఓబీసీ గణనకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

జనాభా లెక్కల్లో ఓబీసీ గణనకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
  •     ప్రధాని మోదీకి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ
  •     తెలంగాణ కుల సర్వే అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచన
  •     కులాలు, సముదాయాలకు ప్రత్యేక డిజిటల్ కోడ్స్ కేటాయించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది ప్రారంభించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీ గణన చేపట్టాలని, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల (ఎస్ఈబీసీ) జనాభాను పారదర్శకంగా నమోదు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. వెనుకబడిన వర్గాల వాస్తవ జనాభా, సామాజిక-ఆర్థిక పరిస్థితులపై విశ్వసనీయ సమాచారం ఉంటేనే రిజర్వేషన్లు, విద్య, ఉపాధి, సంక్షేమం వంటి విధానాలను సమర్థవంతంగా అమలు చేయవచ్చని లేఖలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కేటగిరీలు ఉన్నట్లే, జనాభా లెక్కల ప్రశ్నావళిలో ఓబీసీ, ఎస్ఈబీసీలకు కూడా స్పష్టమైన ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేయాలని కోరారు. 

కేవలం వ్యక్తులు తమ కులం పేరును నమోదు చేయడం వల్ల భవిష్యత్తులో అధికారిక వర్గీకరణపై ఇబ్బందులు రాకుండా ముందే స్పష్టమైన విధానం రూపొందించాలని సూచించారు. 2027 జనాభా లెక్కల్లో ఈ సమస్యలు పునరావృతం కాకుండా ప్రమాణీకృత విధానాన్ని అవలంబించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే (సీపెక్) ద్వారా ఇంటింటికీ వెళ్లి డేటా సేకరణ, కుల సమాచారాన్ని పద్ధతిగా నమోదు చేయడంపై తమకు అనుభవం లభించిందని, ఈ అనుభవాలను 2027 జనాభా లెక్కల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన సూచనలు..

  • ఎస్సీ, ఎస్టీలతోపాటు ఓబీసీ, ఎస్ఈబీసీలకు ప్రత్యేక కేటగిరీని జనాభా లెక్కల ప్రశ్నావళిలో చేర్చాలి
  • రాష్ట్రాలవారీగా సమగ్ర మాస్టర్ కుల డైరెక్టరీని రూపొందించాలి
  • కులాలు, సముదాయాలకు ప్రత్యేక డిజిటల్ కోడ్స్ కేటాయించాలి
  • జాబితాలో లేని, వివాదాస్పదమైన లేదా స్థానికంగా గుర్తింపు పొందిన కులపేర్లను ప్రత్యేకంగా నమోదు చేసి ధ్రువీకరించే విధానం ఏర్పాటు చేయాలి
  • వ్యక్తి స్వయంగా ప్రకటించిన కులం, దానికి సంబంధించిన అధికారిక వర్గీకరణ రెండింటినీ డేటాలో భద్రపరచాలి
  • కేవలం కులపేర్లను సేకరించకుండా, రిజర్వేషన్లు, ప్రాతినిధ్యం, విద్య, ఉపాధి, సంక్షేమానికి ఉపయోగపడే విశ్వసనీయమైన ఓబీసీ, ఎస్ఈబీసీ డేటాసెట్‌‌ను రూపొందించాలి.

కులవారీ జనాభా సమాచారం అవసరం..

దేశంలో సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాల రూపకల్పనకు విశ్వసనీయమైన కులవారీ జనాభా సమాచారం ఎంతో అవసరమని మంత్రి పొన్నం పేర్కొన్నారు. జనాభా లెక్కల దశలోనే విధానపరమైన స్పష్టత లేకపోతే భవిష్యత్తులో ఆ డేటా వినియోగం ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి 2027 జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభమయ్యే ముందే ఓబీసీ, ఎస్ఈబీసీ గణనకు అవసరమైన పద్ధతులు, సాంకేతిక ప్రమాణాలు, డేటా రక్షణ చర్యలను అమలు చేయాలని కోరారు.

బీసీలకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలకు ఏం చేసిందో చెప్పాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీసీ ప్రధాని మోదీ అని చెప్పుకునే బీజేపీ నేతలు ఆ వర్గానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. ఆదివారం గాంధీభవన్‌‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. గతంలో జనగణనలో కులగణన చేస్తామని ప్రకటించి కేంద్రం మోసం చేసిందన్నారు. జనగణనకు సంబంధించి ఇచ్చిన ప్రశ్నావళిలో 13వ నంబర్ కాలమ్ వద్ద ఎస్సీ, ఎస్టీ వివరాలు అడిగి, ఓబీసీల గురించి మాత్రం ప్రస్తావించలేదని గుర్తుచేశారు. 

రెండో దఫాలో కేటగిరీల వారీగా వివరాలు సేకరిస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన్ని కలిసి దీనిపై వినతిపత్రం ఇచ్చామని చెప్పారు. 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ క్యాప్ ఎత్తివేయాలంటే జనాభా లెక్కలు సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ప్రామాణికమైన లెక్కల్లో ఓబీసీ అంశాలు లేకపోతే, ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ప్రేమ ఉంటే, సుప్రీంకోర్టులో 'ఇందిరా సాహ్ని' కేసు తీర్పునకు అనుగుణంగా 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయడానికి దామాషా పద్ధతిలో లెక్కలు తీయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీసీల ఓట్లు కావాలో.. వద్దో.. స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.