- మంచి స్కూళ్లు, కాలేజీలు ఎందుకు పెట్టలేదు
- అధికారం పోయాక గుర్తొచ్చిందా? శ్రీలంకతో పోల్చి అవమానిస్తరా? అని ఫైర్
హైదరాబాద్, వెలుగు: దేశంలో మంచి కాలేజీలు లేవంటూ కేటీఆర్ చేసిన కామెంట్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ‘‘పదేళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? మంచి స్కూళ్లు, కాలేజీలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? అధికారం పోయాక ఈ విషయం గుర్తుకు వచ్చిందా?’’ అని ప్రశ్నించారు.
ఈ మేరకు బండి సంజయ్ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. బీఆర్ఎస్ పాలనపై ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ నుంచే రిపోర్ట్ కార్డ్ వస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘మొదట ఆయన మనవడు స్కూళ్లు బాగోలేవని చెప్పాడు. ఇప్పుడు ఆయన మనవరాలు కాలేజీలు కూడా బాగోలేవని చెబుతోంది. పదేళ్లు అధికారంలో ఉండి, మీరు పరిష్కరించలేకపోయిన సమస్యలను మీ సొంత పిల్లలే ఇప్పుడు ఎత్తిచూపుతున్నారు. మీ రాజకీయ ప్రత్యర్థుల పిల్లలు కాలేజీల్లో ఏం చేస్తున్నారో గమనించడం, ఫోన్లను ట్యాప్ చేయడంపై దృష్టి పెట్టడానికి బదులు, మీ సొంత పిల్లలు చెబుతున్న విషయాలను మీరు వినాల్సింది. ఇక మరో అద్భుతమైన మాట. భారత్ కంటే శ్రీలంక గొప్పదట.. లంకను చూసి భారత్ కంటే గొప్పదని చెప్పేది రావణాసురుడే. రామభక్తులు ఎప్పటికీ తమ మాతృభూమి గురించి ఇంత అవమానకరంగా మాట్లాడరు’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. ‘‘కేసీఆర్ హయాంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? సరిపడా ఉపాధ్యాయులను ఎందుకు నియమించలేదు? యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులు ఎందుకు పేరుకుపోయేలా చేశారు? బీఆర్ఎస్ హయాంలో ఎన్ని పేపర్ లీక్‌లు జరిగాయి? కాలేజీలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు? ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను సకాలంలో ఎందుకు చెల్లించలేకపోయారు?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.
నాకు ఎల్లప్పుడూ నేషనే ఫస్ట్..
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యూనివర్సిటీ విద్యార్థులకు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కనీస గౌరవం కూడా ఇవ్వలేదని బండి సంజయ్ విమర్శించారు. ‘‘ఒకవైపు కాంగ్రెస్ వందేమాతరం పాడటం ఆపాలని కోరుతోంది. మన ఇంజినీర్లను ‘క్రిమినల్ వేస్ట్’ అంటూ అవమానిస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్ భారత్‌లో మంచి కాలేజీలు లేవని, ఇతర దేశాలు భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయని చెబుతోంది. అలాంటి వాళ్లు నేను నా చెమటను త్రివర్ణ కండువాతో తుడుచుకున్నానని నా దేశభక్తిని ప్రశ్నిస్తున్నారు. నా చివరి శ్వాస వరకు కాషాయ జెండాను, త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ధరిస్తాను. ఈ దేశం నా చెమటను చూసింది. భారత్‌కు అవసరమైతే నా రక్తాన్ని కూడా ఇస్తాను. నాకు ఎల్లప్పుడూ నేషనే ఫస్ట్” అని ఆయన పేర్కొన్నారు.
