- రాజ్యాంగంపై మహిళా టీచర్లకు అవగాహన ఉండాలి
- అప్పుడే విద్యార్థులను సమగ్ర వ్యక్తులుగా మార్చగలరు
- యూటీఎఫ్ రాష్ట్ర మహిళా సదస్సులో జస్టిస్ రాధారాణి
హైదరాబాద్, వెలుగు: మహిళా టీచర్లకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రాజకీయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ జి. రాధారాణి సూచించారు. ‘నేటి బాలబాలికలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత మహిళా టీచర్లదే. అయితే, ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలంటే ముందు మహిళా టీచర్లకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రాజకీయాలపై పూర్తి అవగాహన ఉండాలి’ అని ఆమె అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గా భవాని అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహిళా ఉపాధ్యాయుల సదస్సులో ఆమె ముఖ్య వక్తగా పాల్గొన్నారు.
రాజ్యాంగం అనేక హక్కులను ప్రసాదించినా, అవి నేటికీ పూర్తిస్థాయిలో అమలు కావట్లేదని జస్టిస్ రాధారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మహిళా టీచర్ తమకున్న ప్రత్యేక హక్కుల గురించి తెలుసుకోవాలని, వాటిని విద్యార్థులకు కూడా బోధించాలని సూచించారు. అప్పుడే విద్యార్థులను సమగ్రమైన వ్యక్తులుగా తీర్చిదిద్దగలమన్నారు. ఆధునిక సమాజంలో సాంకేతికత పురోగమిస్తున్నా.. సామాజిక, సాంస్కృతిక కట్టుబాట్లు మహిళలను వెనక్కి నెట్టేస్తున్నాయనీ, ఈ అడ్డంకులను అధిగమించాలంటే శాస్త్రీయ దృక్పథం అవసరమని ఆమె సూచించారు.
దేశంలో లక్ష స్కూళ్లు మూత: మరియం ధావలే
నూతన విద్యా విధానం-2020 విద్యా వ్యవస్థను కాషాయీకరణ, ప్రైవేటీకరణ చేసేలా ఉందని ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు మరియం ధావలే విమర్శించారు. 2023-–24లో కోటి మందికిపైగా విద్యార్థులు డ్రాపౌట్లుగా మారారు. దేశవ్యాప్తంగా లక్షకు పైగా సర్కారీ బడులు మూతపడ్డాయని గుర్తు చేశారు. మహిళలు ఇంట్లో చేసే పని విలువ దేశ జీడీపీలో 6 శాతంగా ఉన్నా, దానికి ఎలాంటి గుర్తింపు లేదన్నారు.
