పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై ఐక్య పోరాటం..16 సంఘాలతో టీపీజేఏసీ ఏర్పాటు

పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై ఐక్య పోరాటం..16 సంఘాలతో టీపీజేఏసీ ఏర్పాటు
  •     జేఏసీ చైర్మన్‌‌గా నాగరాజు ఎన్నిక
  •     జీవో నం.97ను రద్దు చేయాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: పాలిటెక్నిక్ కాలేజీల విభాగాన్ని ‘శక్తి’ విభాగంలో విలీనం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.97ను నిరసిస్తూ ఆదివారం మాసబ్‌‌ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో 16 టీచింగ్, నాన్-టీచింగ్ సంఘాలు సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ విద్య స్వతంత్రతను కాపాడుకోవడానికి తెలంగాణ పాలిటెక్నిక్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీపీజేఏసీ)ని ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి సంబంధించిన ఉన్నతాధికారులకు గానీ, భాగస్వామ్య ఉద్యోగ సంఘాలకు గానీ కనీస సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ... ఐక్య పోరాటాల కోసం టీపీజేఏసీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 

జేఏసీ చైర్మన్‌‌గా నాగరాజు, కన్వీనర్‌‌గా సురేశ్, సెక్రటరీ జనరల్స్‌‌గా శ్రవణ్ కుమార్, శ్రీరామ్, కో–చైర్మన్లుగా సౌజన్య, సునీత, అడ్వైజర్లుగా ఆనంద్, రమణ ప్రసాద్, రాజా, కృష్ణ, డాక్టర్ చంద్రశేఖర్‌‌లను ఎన్నుకున్నారు. ఐక్యంగా పోరాడితేనే సాంకేతిక విద్యను కాపాడుకోగలమని, ప్రభుత్వం జీవో 97ను వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ' పేరుతో ఎస్‌‌బీటీఈటీ నిధులను మళ్లించడాన్ని జేఏసీ నేతలు తప్పుబట్టారు. పీపీపీ మోడ్‌‌లో నడిచే వ్యవస్థ కింద పాలిటెక్నిక్‌‌లను చేర్చడం వల్ల విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతారని, విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.