పెట్రో, డీజిల్ నుంచి 18,766 ఆటోలు ఈవీలుగా..క్యూర్ పరిధిలో ఆటోలన్ని మార్చేస్తాం: మంత్రి పొన్నం

పెట్రో, డీజిల్ నుంచి 18,766 ఆటోలు ఈవీలుగా..క్యూర్ పరిధిలో ఆటోలన్ని మార్చేస్తాం: మంత్రి పొన్నం

హైదరాబాద్​సిటీ, వెలుగు: క్యూర్ పరిధిలో కాలుష్య నియంత్రణ కోసం ప్రస్తుతమున్న పెట్రోల్, డీజిల్ ఆటోలను రెట్రోఫిట్​చేసి ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునే స్కీంకు ప్రభుత్వం రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయించిందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల నుంచి రూ.50 కోట్ల చొప్పున సమకూర్చుకుంటామన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047కు అనుగుణంగా ‘తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం–2026’ రూపకల్పనకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. క్యూర్ పరిధిలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌తో నడుస్తున్న ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలతో భర్తీ చేయడం ద్వారా కాలుష్యం తగ్గించడమే పథకం లక్ష్యమన్నారు. ఎలక్ట్రిక్ ఆటోలను కొనేవారికి 1.50లక్షలు సబ్సిడీగా ఇవ్వనున్నట్టు తెలిపారు. 

డ్రైవర్లకు రెండు అవకాశాలు 

క్యూర్​పరిధిలో 11,254 డీజిల్​ఆటోలు, 7,512 పెట్రోల్​ఉన్నాయని, వీటన్నింటిని ఈవీలుగా మారుస్తామని మంత్రి పొన్నం ప్రకటించారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి తన అవసరానికి అనుగుణంగా రెండు మార్గాల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చన్నారు. ఇందులో ప్రస్తుత ఆటోను ఎలక్ట్రిక్ రెట్రోఫిట్టెడ్‌గా మార్చుకునే వీలుంటుందని, కిట్ ఖర్చు, ఇన్‌స్టాలేషన్, ప్రామాణిక ఫిట్మెంట్ ఉపకరణాల ఖర్చుతో కలిపి రూ.1.50 లక్షల వరకు లేదా వాస్తవ వ్యయం ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందిస్తుందన్నారు. అలా కాకుండా కొత్త ఎలక్ట్రిక్ ఆటోలను కొనాలనుకునేవారికి చెల్లించే మొత్తంలో రూ.1.50 లక్షల సబ్సిడీ ఇవ్వనున్నట్టు తెలిపారు.

మూడు స్థాయిల్లో..

స్కీం పారదర్శకంగా, సమర్థవంతంగా అమలయ్యేలా మూడు స్థాయిల్లో సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్‌సీ), పథకం అమలు కమిటీ(ఎస్ఐసీ), జిల్లా మంజూరు కమిటీ(డీఎస్‌సీ) ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  

ఇది ఆటో డ్రైవర్ల విజయం : టీజీపీ డబ్ల్యూయూ 

ప్రభుత్వం రెట్రోఫిట్టెడ్​ స్కీం అమలు చేయాలని నిర్ణయించడంపై తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీ డబ్ల్యూయూ) అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్​ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. దీర్ఘకాలంగా డిమాండ్ లో ఉన్న  పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ రెట్రోఫిట్మెంట్‌కు అనుమతి కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది తెలంగాణ ఆటో డ్రైవర్ల  విజయంగా అభివర్ణించారు.