ఆఖరి క్షణంలో లగ్గం ఆగింది.. పీటల మీదికి వచ్చాక పెళ్లి ఇష్టం లేదన్న వధువు.. నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన

ఆఖరి క్షణంలో లగ్గం ఆగింది..  పీటల మీదికి వచ్చాక  పెళ్లి ఇష్టం లేదన్న వధువు.. నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన
  • ఇరువర్గాల అంగీకారంతో చివరి క్షణంలో ఆగిన పెండ్లి

లింగాల, వెలుగు: పెళ్లి పీటలపై వధువు తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పడంతో వివాహం రద్దయింది. వివరాల్లోకి వెళ్తే.. నాగర్​కర్నూల్​ జిల్లా లింగాల మండలం క్యాంప్  రాయవరం గ్రామానికి చెందిన యువకుడికి, బిజినేపల్లి మండలం సల్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట గ్రామానికి చెందిన యువతికి ఆదివారం లింగాలలోని ఓ ఫంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వివాహం జరగాల్సి ఉంది. బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి.

 పీటలపైకి వచ్చిన వధువు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అనంతరం ఆమె స్పృహ కోల్పోయి కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న వధువు తనకు పెళ్లి ఇష్టం లేదని, తన అభిప్రాయాన్ని గౌరవించాలని కుటుంబ సభ్యులను వేడుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగగా, సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 

సఖి కేంద్రం సిబ్బందిని రప్పించి యువతి, ఇరువర్గాల కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. యువతి ఇష్టానికి ప్రాధాన్యం ఇవ్వాలని, బలవంతంగా పెళ్లి చేయవద్దని సఖి కేంద్రం సిబ్బంది సూచించారు. దీంతో ఇరువర్గాల కుటుంబ సభ్యులు వివాహాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు చేసిన ఖర్చులను ఇరువర్గాలు పంచుకోవాలని నిర్ణయించుకొని వెళ్లిపోయారు.