ఉక్రెయిన్‌లోని అతిపెద్ద స్టీల్ ఉత్పత్తి సంస్థ అయిన ఆర్సెలర్ మిట్టల్ క్రివీ రిగ్ పై రష్యా జరిపిన క్షిపణి దాడి తీవ్ర కలకలం రేపింది. భారతీయ బిలియనీర్ లక్ష్మీ మిట్టల్‌కి చెందిన ఈ ప్లాంట్‌పై ఆగస్టు 16న జరిగిన దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 10 మందికి పైగా కార్మికులు, కాంట్రాక్టర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పరిణామంతో కంపెనీ తన కార్యకలాపాలను పాక్షికంగా నిలిపివేయవలసి వచ్చింది.
ఈ దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. రష్యా బాలిస్టిక్ క్షిపణులు చేరుకోగల ప్రతిచోటా పబ్లిక్ ఇన్ ఫ్రా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. క్రివీ రిగ్‌లో ఇద్దరు మృతి చెందడంతో పాటు 14 మంది గాయపడ్డారని, అలాగే సుమీ నగరంలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడిని సమర్థించుకుంది. క్రివీ రిగ్‌లోని మెటలర్జికల్ ప్లాంట్‌తో పాటు కీవ్‌లోని పలు సైనిక-పారిశ్రామిక కేంద్రాలపై దాడులు చేసినట్లు రష్యా తెలిపింది. ముఖ్యంగా ఉక్రెయిన్ స్వయంగా తయారు చేస్తున్న 'ఫ్లెమింగో' లాంగ్ రేంజ్ మిస్సైస్ తయారీ కేంద్రమే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు రష్యా స్పష్టం చేసింది.
ఉక్రెయిన్ సైతం రష్యాపై తనదైన శైలిలో విరుచుకుపడింది. రష్యాపై వందల సంఖ్యలో డ్రోన్లతో విరుచుకుపడి భారీ ప్రతీకార దాడికి పాల్పడింది. రష్యా గగనతలంలో వందలాది డ్రోన్లను కూల్చివేశామని రష్యా రక్షణ శాఖ పేర్కొన్నప్పటికీ.. దీంతో మాస్కో ప్రాంతంలో ఒక వృద్ధుడితో సహా 6 మంది మృతి చెందారు. పాడోల్స్‌లోని వైల్డ్‌బెర్రీస్ వేర్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
తాజా దాడులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ కూడా తీవ్రంగా నష్టపోయింది. రష్యా దాడుల కారణంగా కీవ్‌లోని ప్రసిద్ధ బుక్ మార్కెట్ కాలిబూడిదైంది. పోచైనా మెట్రో స్టేషన్ సమీపంలోని ఈ బుక్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి, కియోస్క్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు ఉధృతంగా సాగుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
