2 రోజుల్లో రూ.20వేల కోట్లు వెనక్కి.. స్టాక్ మార్కెట్లను గడగడలాడిస్తున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు!

2 రోజుల్లో రూ.20వేల కోట్లు వెనక్కి.. స్టాక్ మార్కెట్లను గడగడలాడిస్తున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు!

భారతీయ స్టాక్ మార్కెట్లకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు చుక్కలు చూపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా గడచిన 2 ట్రేడింగ్ సెషన్లలోనే ఏకంగా రూ.20వేల కోట్లకు పైగా ఈక్విటీలను అమ్మేసి రికార్డు సృష్టించారు. బుధవారం ఒక్కరోజే రూ.10వేల 148 కోట్లు, మంగళవారం రూ. 9వేల 980 కోట్లకు పైగా నిధులను వెనక్కి తీసుకోవడంతో రెండు రోజుల్లోనే మొత్తం రూ.20వేల 128 కోట్ల అవుట్‌‌ఫ్లో నమోదైంది. దీంతో సెప్టెంబర్ నెల మొత్తం FPIల అమ్మకాలు ఏకంగా రూ.35వేల 860 కోట్లకు చేరాయి. 2026లో ఇదే అత్యధిక నెలవారీ ఔట్‌ఫ్లో.

2026లో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు ఏకంగా రూ.2లక్షల 60వేల 302 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ఇది 2025 మొత్తం నమోదైన రూ.లక్షా 66వేల 286 కోట్ల అవుట్‌ఫ్లోతో పోలిస్తే ఏకంగా 57 శాతం ఎక్కువ. ఈ భారీ అమ్మకాల ఒత్తిడి కారణంగా సెప్టెంబర్‌లో నిఫ్టీ 6.43%, సెన్సెక్స్ 6.19% మేర కుప్పకూలాయి. మార్కెట్‌లో కొనుగోలుదార్ల కంటే అమ్మేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరగడం దలాల్‌ స్ట్రీట్‌ను మరింత దిగజార్చుతోంది.

అమెరికా 10 సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్స్ 5.29 శాతానికి ఎగబాకడం గ్లోబల్ మార్కెట్లను వణికిస్తోంది. దీనికి తోడు అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాచుతోంది. రష్యన్ క్రూడ్ కొనుగోలుపై అమెరికా టారిఫ్ నిబంధనలు, ఆంక్షల ప్రభావం భారత్ దిగుమతి ఖర్చులపై పడుతుండటంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందన్న అంచనాలు ఈ అమ్మకాలను మరింత వేగవంతం చేశాయి.

గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుతున్న ఆదాయాలు, సంకటంలో పడిన ఆర్థిక పరిస్థితుల మధ్య పండుగ సీజన్ డిమాండ్ ఒక్కటే మార్కెట్‌కు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది. నిఫ్టీ ప్రస్తుత నెగటివ్ బయాస్‌తో 22,400 స్థాయి కీలక మద్దతు ప్రాంతం వైపు పయనించే ప్రమాదం ఉందని బజాజ్ బ్రోకింగ్ నిపుణుల అంచనా. సూచీలు మళ్లీ కోలుకోవాలంటే 23,000 నుంచి 23,100 స్థాయిలను తిరిగి దక్కించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ అమ్మకాల జోరు మార్కెట్లను మరింత ఒత్తిడిలోకి నెట్టేసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.