Ananya Raj: ఏడాదిగా ఇంత నరకం అనుభవించిందా? హీరోయిన్ అనన్య రాజ్ మృతికి కారణాలివే...!

Ananya Raj: ఏడాదిగా ఇంత నరకం అనుభవించిందా? హీరోయిన్ అనన్య రాజ్ మృతికి కారణాలివే...!

యువ నటి అనన్య రాజ్ (Ananya Raj) 27 ఏళ్ల వయసులో కన్నుమూయడం సినీ పరిశ్రమతో పాటు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాలీవుడ్‌తో పాటు ప్రాంతీయ చిత్రాల్లోనూ నటించిన ఆమె ఆకస్మిక మరణం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే అనన్య రాజ్.. నిద్రలోనే చనిపోవడానికి గల కారణాలేంటి? అని సినీ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ విషాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. 

నెల రోజులు ఎందుకు పట్టింది?  

నటి అనన్య రాజ్ మరణించిన విషయం దాదాపు నెల రోజుల పాటు బయటకు రాలేదు. జూలై 15, 2026న ఆమె మృతి చెందగా, ఆగస్టు 16న కుటుంబం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, తమ 27 ఏళ్ల కుమార్తెను కోల్పోయిన తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులు కొంతకాలం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కారణంగానే ప్రకటన ఆలస్యమైనట్లుగా సినీ వర్గాలు వెల్లడించాయి.  

అనన్యను వేధించిన ఆరోగ్య సమస్యలు ఏంటి?  

కుటుంబ సభ్యులు, ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, అనన్య రాజ్ గత ఏడాది కాలంగా తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడినట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు ఎదురైన నిర్దిష్ట అనారోగ్యం (Medical Diagnosis)  ఏమిటి? దానికి సంబంధించిన వైద్యపరమైన నిర్ధారణ ఏమిటి? అనే విషయాలను కుటుంబ సభ్యులు లేదా సినీ వర్గాలు అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ, అనన్య చివరి వరకు ఎంతో ధైర్యంగా తన ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కొన్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీంతో ఆమె అభిమానుల్లో మరింత విషాదం నెలకొంది.

అనన్యకు అసలు ఏ ఆరోగ్య సమస్య ఎదురైంది? ఆమె ఏడాది కాలంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? అనే విషయాలపై అభిమానులు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “అసలు అనన్యకు ఏమైందో అది చెప్పండి? నిజం ఎందుకు వెల్లడించడం లేదు?” అంటూ కొందరు ప్రశ్నిస్తుండగా, “ఏడాదిగా ఇంత బాధను అనుభవించిందా?” అంటూ మరికొందరు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అధికారికంగా వెల్లడించని వైద్య వివరాలపై ఊహాగానాలు చేయడం సరికాదని, కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అనన్య సినిమా కెరీర్..

ముంబైలో పుట్టి పెరిగిన నటి అనన్య రాజ్ హిందీతో పాటు పలు ప్రాంతీయ చిత్రాల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలు, మ్యూజిక్ వీడియోల ద్వారా వినోద రంగంలోకి అడుగుపెట్టిన ఆమె, 2016లో ‘7 అవర్స్ టు గో’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2017లో ‘ది ఫైనల్ ఎగ్జిట్’, 2019లో ‘ఘోస్ట్’ చిత్రాల్లో నటించారు. తెలుగులో 2017లో వచ్చిన ‘తగేదే లే’ మూవీతో పాటుగా మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ ‘మద్రాసీ గ్యాంగ్’ లో నటించి మెప్పించింది. కెరీర్ పుంజుకుంటున్న సమయంలో ఇలా జరగడం పట్ల సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.