సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు.. ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన ఆప్

సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు.. ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన ఆప్

చండీఘర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పంజాబ్‎లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ గురించి సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మౌర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సుఖ్‌వీర్ సింగ్ మైసర్‌ఖానాను ఆప్ పార్టీ నుంచి బహిష్కరించింది. సుఖ్‌వీర్ వ్యాఖ్యలను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రమశిక్షణా రాహిత్యంగా పేర్కొంది. ఎమ్మెల్యే సుఖ్‌వీర్ చేసిన ఆరోపణలు అవాస్తవాలని.. ఆయన ప్రస్తావించిన పాఠశాలలో ఇప్పటికే 25 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారని పార్టీ స్పష్టం చేసింది. 

పంజాబ్‌లోని మౌర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సుఖ్‌వీర్ సింగ్ తన సొంత్ ఆప్ ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేశారు. తన నియోజకవర్గంలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులను భర్తీ చేయాలని సీఎం భగవంత్ మాన్, ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా సహా అధిష్టానానికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని ఆయన వాపోయారు. ఈ మేరకు సుఖ్‌వీర్ సింగ్ ఫేస్‌బుక్ లైవ్ పెట్టారు. 

ఎమ్మెల్యే సుఖ్‌వీర్ సింగ్ వీడియో పంజాబ్ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. అసెంబ్లీ ఎన్నికల ముంగిట ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆప్ ఎమ్మెల్యే సుఖ్‌వీర్ సింగ్ వీడియోను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో భగవంత్ మాన్ సర్కార్ ఇరుకునపడింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుఖ్ వీర్ సింగ్ వ్యాఖ్యలను ఆప్ హైకమాండ్ సీరియస్‎గా తీసుకుంది.

 అతడు చేసిన ఆరోపణలను పరిశీలించి అవన్నీ నిరాధారమైనవిగా నిర్ధారించింది. ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రమశిక్షణా రాహిత్యంగా పేర్కొంటూ సుఖ్ వీర్ సింగ్‎ను పార్టీ నుంచి బహిష్కరించింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఆప్ సొంత పార్టీ ఎమ్మెల్యేపై వేటు వేయడం పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.