జపాన్‌లోని నిస్షిన్ కోరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా ఉత్కంఠభరితంగా కొనసాగిన ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ ఫైనల్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించి టోర్నమెంట్‌లో అజేయంగా నిలిచిన టీమిండియా, వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని (Gold Medal) కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సమిష్టిగా రాణించి దాయాది దేశాన్ని 19 పరుగుల తేడాతో ఓడించింది.
హసన్ నవాజ్ ఒంటరి పోరాటం..192కే పరిమితమైన పాక్:
భారత జట్టు నిర్దేశించిన 212 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులకే పరిమితమైంది. పాక్ జట్టు తరపున ఓపెనర్ హసన్ నవాజ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో చివరి వరకు ఒంటరి పోరాటం చేస్తూ 96 పరుగులు సాధించాడు. అయినప్పటికీ ఇతర బ్యాటర్ల నుంచి తగిన సహకారం లభించకపోవడంతో పాకిస్థాన్ జట్టుకు మళ్లీ ఓటమి తప్పలేదు.
అక్షర్, వాషింగ్టన్ కట్టడి.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం:
212 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ఇండియన్ బౌలర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో దాయాది బ్యాటర్లను కట్టడి చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పారు. అయితే మరోవైపు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ రవి బిష్ణోయ్ మాత్రం ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయారు. అయినప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ టీమిండియాను విజయతీరాలకు చేర్చడంలో జట్టు సఫలమైంది. అంతకుముందు బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ (61), తిలక్ వర్మ (51) అర్ధశతకాలతో రాణించిన సంగతి తెలిసిందే.
స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన శ్రేయస్ సేన:
ఈ విజయంతో ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్‌లో భారత జట్టు తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. గత టోర్నమెంట్‌లో మాదిరిగానే ఈసారీ పసిడి పతకాన్ని ముద్దాడి, ఛాంపియన్‌గా నిలిచింది. మ్యాచ్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన శ్రేయస్ అయ్యర్ సేనను దేశవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులు, మాజీ క్రికెటర్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు.
𝙂𝙊𝙇𝘿-standard performance ✨🥇
— BCCI (@BCCI) October 3, 2026
Scorecard ▶️ https://t.co/g4wzZagyGj#TeamIndia | #AsianGames | @OfficialAbhi04 pic.twitter.com/RB9vv1ikcb
𝗚𝗢𝗟𝗗 𝗠𝗘𝗗𝗔𝗟𝗟𝗜𝗦𝗧𝗦 𝗔𝗚𝗔𝗜𝗡 🥇
— BCCI (@BCCI) October 3, 2026
Congratulations #TeamIndia for successfully defending the Asian Games Gold Medal 👏👏
Scorecard ▶️ https://t.co/g4wzZagyGj#AsianGames pic.twitter.com/sg7z4dhUzH
