Nushrratt Bharuccha: ‘ఛత్రపతి’ హీరోయిన్కు యాక్సిడెంట్.. ఎయిర్ అంబులెన్స్లో ముంబైకి తరలింపు!

Nushrratt Bharuccha: ‘ఛత్రపతి’ హీరోయిన్కు యాక్సిడెంట్.. ఎయిర్ అంబులెన్స్లో ముంబైకి తరలింపు!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ హీరోయిన్ నుష్రత్ భరూచా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హాలిడే ట్రిప్ కోసం ఇండోనేషియాలోని బాలి వెళ్లిన ఆమె.. అక్కడ జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో నుష్రత్ వెన్నెముకకు ఫ్రాక్చర్ అయినట్లు ఆమె పీఆర్ టీమ్ తెలిపింది. ప్రస్తుతం బాలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను సర్జరీ కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే నుష్రత్కు ప్రమాదం ఎలా జరిగింది? అనే విషయాన్ని మాత్రం ఆమె టీమ్ ఇప్పటివరకు వెల్లడించలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశం, కారణం, ప్రమాద సమయంలో నుష్రత్ ఏం చేస్తున్నారనే వివరాలుపై క్లారిటీ రావాల్సి ఉంది. 

వెన్నెముకకు ఫ్రాక్చర్.. సర్జరీకి సిద్ధం..

నుష్రత్‌కు వైద్యులు మరిన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం.. వెన్నెముకకు సర్జరీ చేయాలని నిర్ణయించినట్లు ఆమె పీఆర్ టీమ్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం ఆమెను బాలి నుంచి ముంబైకి ఎయిర్ అంబులెన్స్‌లో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ముంబైకి చేరుకున్న తర్వాత నుష్రత్‌కు సర్జరీ నిర్వహించనున్నారు.

కొన్ని వారాల పాటు షూటింగ్స్‌కు బ్రేక్..

గాయం తీవ్రత, సర్జరీ కారణంగా నుష్రత్ కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని ఆమె టీమ్ తెలిపింది. దీంతో రాబోయే కొన్ని వారాల పాటు ఆమె వర్క్ కమిట్‌మెంట్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటం, అవసరమైన వైద్యం అందించడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని టీమ్ పేర్కొంది. నుష్రత్ ఆరోగ్యంపై మరిన్ని వివరాలను అవసరమైన సమయంలో వెల్లడిస్తామని, ఈ సమయంలో ఆమె ప్రైవసీని గౌరవించాలని ఆమె టీమ్ అభిమానులు, మీడియాను కోరింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలి ట్రిప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సినిమాల విషయానికొస్తే..

నుష్రత్ భరూచా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘లవ్ సెక్స్ ఔర్ ధోఖా’, ‘ప్యార్ కా పంచ్‌నామా’, ‘సోనూ కే టిటు కీ స్వీటీ’, ‘డ్రీమ్ గర్ల్’, ‘జనహిత్ మేన్ జారీ’, ‘రామ్ సేతు’, ‘తూ ఝూతీ మేన్ మక్కార్’, ‘అకేలీ’ వంటి చిత్రాల్లో నటించారు. ఇక తెలుగు ప్రేక్షకులకు ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో మరింత పరిచయమయ్యారు.

ఇటీవల ‘ఛోరీ 2’, ‘ఉఫ్ యే సియాపా’ చిత్రాల్లో కనిపించిన నుష్రత్.. ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ హీరోగా రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ సినిమాలోనూ ఆమె నటిస్తున్నట్లు సమాచారం.